అవినీతిని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా… కాంగ్రెస్ నాయకులు సిద్ధమా

– కోన సముందర్ సింగిల్ విండో చైర్మన్ సామా బాపురెడ్డి 

నవతెలంగాణ కమ్మర్ పల్లి
కొన సముందర్ సింగిల్ విండోలో తాను అవినీతికి పాటుపడినట్లు కాంగ్రెస్ నాయకులు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారని, నిరూపించ లేకపోతే  కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్కు నెలకు రాస్తారా? అని విండో చైర్మన్ సామ బాపురెడ్డి సవాల్ విసిరారు. సోమవారం మండలంలోని కోన సముందర్ సింగిల్ విండో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.విండో చైర్మన్ గా సుమారు రూ.60 లక్షల వరకు తాను అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు సరికాదన్నారు. అధికారులు తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప, తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలతో విండో పరిధిలోని రైతులను అయోమయానికి గురి చేయడం ఎంతవరకు సబబు అన్నారు. కాంగ్రెస్ నాయకుల బాగోతం రైతులకు అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం మానుకొని ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు విషయంలో దృష్టి పెడితే బాగుంటుందన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై దాడి చేసిన, ఇబ్బందుల గురి చేసిన సంఘటనలు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రామాల్లో టిఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. పదవులు శాశ్వతం కాదనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. రైతులకు సేవ చేయలే గాని రాజకీయం చేయొద్దని, ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో  మండల పరిషత్ ఉపాధ్యక్షులు కాలేరు శేఖర్, డైరెక్టర్ బుస్సాపురం నవీన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.