పాలనాధికారి తీసుకునే నిర్ణయాలకు కిందిస్థాయి అధికారులే కారణమా..?

– ఆకారణంగా బలవుతున్నామని అధికారుల ఆవేదన 
– తప్పుడు సమాచారంమే సస్పెన్షన్ కు కారణమా?
– పంచాయతీ కార్యదర్శులు సెలవుల్లోకి వెళ్లనున్నారా..!
– 28న కలెక్టర్ ఎ నిర్ణయం తీసుకోనున్నారు?
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
జిల్లా పాలనాధికారి తీసుకునే నిర్ణయాలకు ముఖ్య కారకులు కిందిస్థాయి అధికారులేనని జిల్లాలోని కొందరు అధికారులు, పలు శాఖల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మండల స్థాయి అధికారులు ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పకుండా  తప్పుడు సమాచారాన్ని ఇవ్వటం వల్లనే జిల్లాలో అధికారులు, ఉద్యోగుల సస్పెన్షన్ లు జరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. గడ్డి కోత యంత్రాలు కొనక పోవడం, ప్లాంటేషన్,పారిశుద్ధ్యం, కంపోస్టు షెడ్ నిర్వహణ సరిగా లేని కారణంగా గుర్రంపోడు ఎంపీడీఓ పి.మంజులను అలాగే, అనధికారికంగా విధులకు గైర్ హాజరు కావడం, మండల ప్రత్యేక అధికారి వచ్చినప్పుడు  అందుబాటులో లేకపోవడం, గ్రామ పారిశుధ్యం, చెత్త సేకరణ, ప్లాంటేషన్ తదితర విషయాల పట్ల నిర్లక్ష్యంగా వహించినందుకు పెద్దవూర మండలం పులిచర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. నాగరాజు ను, ఉద్యోగం నుంచి తొలగించారు.అదేవిధంగా పారిశుద్ధ్యం క్రిమిటోరియం నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా ఉన్న దామరచర్ల మండలం వాచ్య తండా గ్రామ పంచాయతీ సెక్రటరీ కె.స్వప్న ని సస్పెండ్ చేశారు. అయితే మండల స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం అందివ్వడం వల్లే తరచు అధికారులు, సిబ్బంది సస్పెన్షన్ కు గురవుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
నా తప్పేం లేదు…
ఇదే విషయమై విధుల నుండి తొలగించబడ్డ  పంచాయతీ కార్యదర్శి  మాట్లాడుతూ మంగళవారం మిర్యాలగూడలో సబ్ కలెక్టర్ తో సమావేశం ఉంది. సమావేశానికి మిర్యాలగూడ వెళ్లాను. అక్కడికి వెళ్లాక సమావేశం క్యాన్సల్ అయిందని తెలిసింది. గ్రామంలో మోటార్ రిపేర్ అయి నీటి సమస్య ఉంది. విషయాన్ని డిఈకి చెబితే సాంక్షన్ చేశారు. నల్లగొండలో మోటర్ ఉంటుందని ఏఈ చెప్పారు. అది తీసుకొని వెళ్దామని నల్లగొండ కి వచ్చాను. నేను నల్లగొండ కి రాగానే ఎంపీడీవో నాకు కాల్ చేశారు. ఎక్కడున్నావు అని అడిగితే నేను మోటర్ తీసుకొని రావడానికి నల్లగొండకు వచ్చానని చెప్పాను. మళ్లీ 15 నిమిషాలకు ఎంపీడీవో  ఫోన్ చేసి మండల ప్రత్యేక అధికారి వస్తున్నారు 15 నిమిషాలలో రావాలని చెప్పారు. నల్లగొండ నుండి పులిచర్లకు గంటన్నర సమయం ప్రయాణం ఉంటుంది. అదే విషయాన్ని ఎంపీడీవో కు చెప్పి ప్రత్యేక అధికారికి చెప్పమని చెప్పాను. అయితే కలెక్టర్  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎంపీడీవో అసలు విషయాన్ని చెప్పకుండా నేను విధులకు గైర్హాజరైనట్లు చెప్పడంతో కలెక్టర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా నన్ను వీధులలోకి తీసుకోవాలి. తప్పుడు సమాచారానికి నన్ను బలి చేయవద్దు.
అదనపు కలెక్టర్ ని కలిసిన పంచాయతీ కార్యదర్శి ల యూనియన్…
అకారణంగా విధుల నుండి తొలగించిన పంచాయతీ కార్యదర్శిని, అదేవిధంగా సస్పెండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని తక్షణమే విదులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అదనపు కలెక్టర్ పూర్ణచంద్రను కలిశారు. పంచాయతీ కార్యదర్శులను విధులను తీసుకోని పక్షంలో జిల్లాలో ఉన్న 844 మంది గ్రామపంచాయతీ సెక్రటరీలతో కలిసి మూకుమ్మడిగా సెలవుల్లోకి వెళ్ళనున్నట్లు తెలిపారు. విధులలోకి తీసుకునే వరకు సెలవులో ఉంటామని, అవసరం అయితే పెన్ డౌన్ చేస్తామని పేర్కొన్నారు.కాగా విషయంపై స్పందించిన అదనపు కలెక్టర్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని పంచాయతీ కార్యదర్శులకు హామీ ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులు అంతా విధులలోకి వెళ్లాలని, బాధ్యతయుతంగా విధులను నిర్వర్తించాలని సూచించారు.
మహారాష్ట్రకు వెల్లిన కలెక్టర్…
రాష్ట్రంలో డిజిటల్ కార్డులను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి ఇప్పటికే డిజిటల్   కార్డులను అమలు చేస్తున్న మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలకు పంపించారు. అయితే సర్వేలో భాగంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి బుధవారం మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ డిజిటల్ కార్డులపై సర్వే నిర్వహించి 27న సాయంత్రం జిల్లాకు రానున్నారు. 28వ తేదీ విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే  పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్ విషయంపై ఏ నిర్ణయం తీసుకుంటారు? కలెక్టర్ వచ్చేవరకు పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరు అవుతారా? లేక మూకుమ్మడి సెలవుల్లోకి వెళతారా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే ప్రత్యేక అధికారులతో సతమతమవుతున్న గ్రామపంచాయతీలు.. సెక్రటరీలు కూడా సెలవుల్లోకి వెళితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి.