– కార్పొరేట్ కాలేజీల మాయ
– మూడు నెలల ముందే అడ్మిషన్లు
– ఇంటర్ కాలేజీల ఇష్టారాజ్యం
– ఇంకా వెలువడని నోటిఫికేషన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంటర్‌మీడియట్ ప్రయివేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు పూర్తికాక ముందే, వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడకముందే కొన్ని కార్పొరేట్, ప్రయివేటు ఇంటర్ కాలేజీలు అడ్మిషన్లు షురూ చేశాయి. రాయితీల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను వలవేస్తూ ముందస్తు ‘సీట్ల’ దందాకు తెరలేపాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొన్ని ఇంటర్ కాలేజీలు జనవరి నెలలోని అడ్మిషన్లు ప్రారంభించాయి. పదోతరగతి పరీక్షలు కూడా పూర్తి కాకమందే పలు కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభించాయి. ముందుగా అడ్మిషన్లు తీసుకుంటే ఫీజు రాయితీ భారీగా ఉంటుందని, పదో తరగతి ఫలితాల తర్వాత ఈ రాయితీ ఉండదు అని విద్యార్థుల తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముందుగా బుక్ చేసుకోకుంటే తర్వాత సీట్లు ఉండవని, ఫీజు తగ్గించడం కుదరదని కాలేజీల యాజమాన్యాలు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాయి. మంచి కాలేజీల్లో సీట్లు దొరకవేమోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు కాలేజీలు చెప్పిన మొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. ఈ దందాను అరికట్టాలని ఇంటర్‌బోర్డు అధికారులను విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
ఏప్రిల్ లేదా మేలో అడ్మిషన్ల నోటిఫికేషన్..
వాస్తవానికి పదోతరగతి పరీక్షలు ముగిసి, ఫలితాలు వెల్లడించిన తర్వాతే ఇంటర్‌బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. అప్పుడే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ లేదా మే నెలలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కానీ కార్పొరేట్ కాలేజీలు ముందుగానే ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ పేరిట భారీగా వసూలు చేస్తున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమైనా.. ఇంటర్ విద్యా అధికారుల పర్యవేక్షణా లోపం.. కాలేజీలను అదుపుచేసే పరిస్థితి లేకపోవడంతో ఇలా జరుగుతున్నదని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి.ఉప్పల్‌లోని కొన్ని క్యాంపస్‌లలో బైపీసీ (నీట్)లో అడ్మిషన్లు పూర్తి అయినట్టు ప్రచారాన్ని సృష్టించడం గమనార్హం.
ఇంటర్ పరీక్షలు ఇలా..
ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి18వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏఫ్రిల్ 2వ తేదీ వరకు జరుగనున్నాయి.
నోటిఫికేషన్ తర్వాతనే అడ్మిషన్లు
కిషన్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
ఇంటర్‌బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్ ఏప్రిల్ లేదా మే నెలలో వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించాలి. ముందే అడ్మిషన్లు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు రాగా.. ఆ కాలేజీతో మాట్లాడాం.
ముందస్తు అడ్మిషన్లు సరికాదు
రాథోడ్ సంతోష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
పదో తరగతి పరీక్షలు జరగకముందే కార్పొరేట్, ప్రయివేటు కాలేజీలు అడ్మిషన్లు ప్రారంభించడం సరికాదు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ మా కాలేజీల్లో చేర్పించండి అంటూ శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు ఒత్తిడి తీసుకోవడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు ప్రయివేటు కాలేజీల ఆగడాలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి.