ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 5న రవాణా శాఖ ఉత్సవాలను నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ సాధించిన విజయాలపై ఆర్టీసీ యాజమాన్యం నాలుగు పేజీల ప్రకటన, అలాగే రవాణా శాఖ సాధించిన విజయాల పేరుతో ఒక బ్రోచర్‌ను విడుదల చేసింది. అందులో అనేక విషయాలు అర్ధసత్యాలుగానే వున్నాయి. సంస్థ పరిపుష్టి, ప్రయాణికులకు మెరుగైన సేవలు, సిబ్బంది సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం పని చేస్తున్నదని రవాణామంత్రి ప్రకటించారు. అంతేకాకుండా, మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటలలోనే అమలులోకి తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని, నవంబర్ 4 నాటికి 116 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచితబస్సు ప్రయాణం చేసి రూ.3916 కోట్లు ఆదా చేసుకున్నారని ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన డబ్బులను ఆర్టీసీకి రీ-ఎంబర్స్ చేస్తున్నామని తెలిపారు.
వాస్తవానికి ఎటువంటి మౌలిక వసతులు మెరుగుపర్చకుండానే ఉచిత ప్రయాణం స్కీంను అత్యంత జయప్రదంగా అమలు చేసింది, చేస్తున్నది ఆర్టీసీ కార్మికులు. గతంలో 40 లక్షల మంది ప్రయాణం చేస్తే, ఇప్పుడు 60 లక్షల మందిని తమ బస్సుల ద్వారా గమ్యస్ధానాలకు అత్యంత భద్రంగా చేరుస్తున్నారు. కానీ ఈ ఏడాది కాలంలో ఉచిత బస్సు పథకం అమలు జరిగే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీబస్సులు ఎన్ని పెరిగాయి? మొత్తంగా ఆర్టీసీలో ఎన్నిబస్సులు పెరిగాయి? అనే వివరాలు ప్రభుత్వం, ఆర్టీసీ ఎందుకు ప్రకటించలేదు? తమ ప్రయాణ అవసరాలు తీరడం లేదని, తమ గ్రామాల ప్రజలు, విద్యార్ధులు తమకు సరైన బస్సుసౌకర్యాలు కల్పించాలని నిత్యం ఆందోళనలు జరుగుతున్నాయి? వీటికి ఎక్కడా జవాబు చెప్పకపోగా, ‘ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ ఏడాది కాలంలో 1389 బస్‌లు అందుబాటులోకి తెచ్చాము’ అని ప్రకటించడం అర్ధసత్యం. ఈ బస్సులు అత్యధిక భాగం కాలం చెల్లిన బస్సుల స్థానంలో తెచ్చినవే. మిగిలినవి ఉచిత ప్రయాణానికి అర్హత లేని డీలక్స్, సూపర్ లగ్జరీబస్సులు మాత్రమే. పదేండ్ల కాలంలో బస్సుల కొను గోలుకు గత సర్కార్ ఇచ్చిన నిధులెన్ని? ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన నిధులెన్ని అనే వివరాలు బహిర్గతం చేస్తే ప్రజలకు వాస్తవం అర్థమయ్యేది. కానీ ఆ పని చేయరు. ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా బస్సుల కొనుగోలుకు ఒక్క పైసా ఇవ్వలేదు అన్నది నిజం కాబట్టే.
ఇరవై లక్షల మంది ప్రయాణికులు పెరిగినా బస్సుల్నిపెంచకుండా ప్రజలు సౌకర్యవంతంగా ఎలా ప్రయాణం చేస్తారు? కార్మికులు ప్రశాంత వాతావరణంలో విధులు ఎలా నిర్వహిస్తారు? నిజానికి ఈ స్కీం అమలులోకి వచ్చిన 20 రోజుల్లోనే తీసుకోవలసిన కొన్ని నిర్ధిష్ట చర్యలు గురించి ఆర్టీసి యాజమాన్యానికి సూచనలు చేసింది స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్). ఏడాది గడిచినా ఆ సూచనలు అమలు చేయనందున నెలకు పదిమందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. అంతేకాక ప్రతి రోజు 2-3 గంటలు ఆలస్యంగా డ్యూటీ ముగుస్తుండటం ద్వారా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. మరి అటు ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా అంతా బాగుందని ప్రచారం చేస్తే ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతుంది అనేది గుర్తించాలి. మహాలకిë స్కీం అమలయ్యే బస్సులు పెంచడంతో పాటు, కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి. ఇవేవి చేయకుండా ప్రయాణికులకు మెరుగైన సేవలు లక్ష్యంగా పని చేస్తున్నామని ఎలా చెపుతారు?నేడు ఆర్టీసిలో 6453 బస్సులు ఆర్టీసివి వుంటే, 2847 అద్దె బస్సులు కలిపి 9300 బస్సులున్నాయి. ఈ అద్దె బస్సులు రద్దుచేసి ఆర్టీసి బస్‌లు పెంచడంతో పాటు మొత్తం బస్‌ల సంఖ్యను పెంచాలి. భారత ప్రభుత్వ / నిటి ఆయోగ్ లెక్కల ప్రకారం భారతదేశంలో సగటున ప్రతి వెయ్యి మంది జనాభాకు కనీసంగా 0.6 బస్సులు వుండాలని నిర్ధేశిస్తున్నది. అ లెక్కన చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా 24,600 బస్సులు, గరిష్టంగా 49,200 బస్సులుండాలి. కానీ రాష్ట్రంలో మహాలకిë పథకం అమలు తర్వాత కూడా బస్సుల సంఖ్య 9వేలుగానే వుంచి సంస్థ పరిపుష్టి మాలక్ష్యం అంటే ఎలా? విద్యుత్ బస్సులు పెంచుతామని, హైదరాబాద్‌లో రాబోయే ఏడాదిలో మొత్తం 2800 బస్సులు విద్యుత్ బస్సులుగా మారుస్తామని, జిల్లాల నుండి తిరిగే బస్సుల్లో కూడా వెయ్యివరకు విద్యుత్ బస్సులు తీసుకొస్తామని, మహిళా సంఘాల ద్వారా అద్దెబస్సులు సమకూరుస్తామనే విధాన ప్రకటన చేసింది.
విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీలను నిర్వీర్యం చేసి, ప్రయివేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి ప్రజారవాణాని (ఆర్టీసీలను) అప్ప చెప్పేందుకు కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2015 నుండి విధానాల రూపకల్పన చేసి అమలు చేస్తున్నది. దీన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సమర్ధిస్తూ, అద్దె ప్రాతిపదికన 4వేల వరకు విద్యుత్ బస్సులు తెస్తామని చెప్పడం ఎలా సమర్ధనీయం. ఆ మేరకు ఉద్యోగ కల్పన కూడా వుండదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకాక సామాజిక న్యాయం దెబ్బతింటుది. అలాగే స్వయం సహాయక గ్రూప్‌ల ద్వారా ఆర్టీసిలో అద్దెబస్సులు తెస్తామన్నది కూడా ప్రతికూల ఫలితాన్నిస్తుంది. మొత్తంగా 9వేల బస్సుల్లో 8వేల బస్సులకు పైగా ప్రయివేటు వ్యక్తులు, సంస్థల చేతుల్లో వుంటే ఆ సంస్థ ప్రభుత్వరంగ సంస్థగా ఎలా వుంటుంది? సర్కారే సమాధానం చెప్పాలి.
ఇక మరో విషయం కార్మిక సంక్షేమం. 2017 వేతన ఒప్పందం ఇచ్చామని, 2013 వేతన ఒప్పందం బకాయిలు రూ.280 కోట్లు చెల్లిం చామని ప్రకటించారు.ఈ రెండు విషయాలు నిజం. అయితే కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాలికలో పెట్టిన రెండు పేస్కేల్స్ ఇచ్చి, అరియర్స్ చెల్లిస్తామన్న హామీని పక్కన పెట్టి 2017 పే స్కేలు అరియర్స్ రిటైర్మెంటు సమయంలో చెల్లిస్తామని చెప్పి కార్మికులకు ఎందుకు అన్యాయం చేశారు? ప్రభుత్వ ఈ వైఖరిని ఆసరా చేసుకుని 179 నెలల డిఎ అరియర్స్‌ను కూడా రిటైర్మెంటు సమయంలో చెల్లిస్తామని ఉత్తర్వులు ఇచ్చి మరింత అన్యాయానికి ఆర్టీసి యాజమాన్యం పాల్పడింది. మూడు నెలల్లో మరో పేస్కేలు సమయం వస్తున్నా, 2021 పేస్కేలు ఎందుకు అమలు చేయడం లేదు. యాక్ట్7ఆఫ్ 2023ను అమల్లోకి తెస్తారా? లేదా? ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఈ సర్కార్ వైఖరి ఏమిటి? అనేది ఎందుకు స్పష్టం చేయడం లేదు. 2013 నుండి అమలు చేస్తున్న అలవెన్సులను ఎందుకు సవరించడం లేదు? కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎందుకు కొనసాగిస్తున్నారు? గత ప్రభుత్వం దారిలోనే వెల్ఫేర్ కమిటీలతోనే కాలం వెళ్లబుచ్చాలని ఎందుకు నిర్ణయించారో స్పష్టత ఇవ్వలేదు.
సంక్షేమంలో మరో ముఖ్యమైనది వైద్య సౌకర్యాల కల్పన. తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చామని, సిటిస్కాన్, ఎం.ఆర్.ఐ స్కాన్, ఎమర్జెన్సీ సేవలు వంటివి అన్ని కల్పించామని, గ్రాండ్ హెల్త్ చాలెంజ్ వంటివన్నీ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేస్తున్నారు. తార్నాక ఆసుపత్రి కార్మికుల త్యాగం, భాగస్వామ్యంతో ఏర్పడ్డది. కానీ తమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తమకు వైద్యమందని దౌర్భాగ్యపు పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది. కార్మికుల అమ్మ, నాన్నలకు ఐసియులో వుంచాల్సి వస్తే అందుకు అవసరమైన కిట్లకు అయ్యే ఖర్చు కార్మికులెందుకు భరించాలి. సర్వీసులో వున్నప్పుడే కాదు రిటైరైన తర్వాత కూడా మెరుగైన వైద్యమందించాల్సిన బాధ్యత యాజమాన్యానిదే. కానీ రిటైరైన ఉద్యోగులకు తమ స్వంత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం, మందులు, పరీక్షలు అందాలంటే తమ ఖాతాలో వుండే నాలుగులక్షల నుండి ఖర్చు చేయాలన్న నిబంధన కార్మికుల కుటుంబాలను తీవ్ర నిరాశపరుస్తున్నది.
ఉద్యోగుల భర్తీ కూడా అర్ధసత్యంగానే వుంది. ఆర్టీసిలో 3058 ఉద్యోగులకు ప్రభుత్వం అనుమతించింది అంటున్నారు. వాటిల్లో 2వేల వరకు డ్రైవర్ పోస్టులే వుంటాయి. మరి అటు 4వేల ప్రయివేటు విద్యుత్ బస్‌లు, మరో వెయ్యి వరకు స్వయం సహాయక సంఘాల ద్వారా అద్దె బస్‌లు వస్తుంటే, ప్రస్తుతం వున్న డ్రైవర్లే మిగులు తేలుతారు. వారిని ఏం చేస్తారనే ఆందోళన కార్మికులలో వుంది. దానికి ప్రభుత్వం, యాజమాన్యం వద్ద జవాబు లేదు. అలాగే సర్వీసులో వుండి చనిపోయిన 1400 కార్మిక కుటుంబాలలో బ్రెడ్ విన్నర్ స్కీం క్రింద రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం కల్పించాలి. కానీ ఇప్పటివరకు 557 మందికి అది కూడా ఎటువంటి సౌకర్యాలు లేకుండా కన్సాలిడేటెడ్ వేతనంపై మూడేండ్లు ఉద్యోగం చేపిస్తూ, ఆ తర్వాత వారి రెగ్యులర్ గురించి ఆలోచిస్తారట. ఇది ఆర్టీసీలో అమలులో ఉన్న రెగ్యులేషన్స్‌కు విరుద్ధమైనదే. ఈ విషయంలో గత ప్రభుత్వం దారిలోనే ఈ సర్కారూ నడుస్తున్నది.
మొత్తంగా చూసినప్పుడు ఒకటి రెండు విషయాల్లో తప్ప మిగతావన్ని అర్ధ సత్యాలుగానే వున్నాయి. ఇటువంటి వైఖరి వల్ల ప్రభుత్వం పట్ల నమ్మకం కలగదు. అందుకని వాస్తవాలు ప్రజలు, కార్మికుల ముందుంచాలి. గత పదేండ్లలో ఆర్టీసికి ప్రభుత్వాలు బడ్జెట్‌లో ఇచ్చిన హామీలు, విడుదల చేసిన డబ్బులు, బస్సుల కొనుగోలు కోసం చేసిన సహాయం, బస్‌పాసుల రాయితీల డబ్బులు చెల్లింపు వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేసి, ఆర్టీసీ నిర్వహణలో వాటికి భాగస్వామ్యం కల్పించాలి. ఆర్టీసీ ప్రయివేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి పోకుండా ప్రజా పోరాటాల ద్వారా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే.
వి.యస్. రావు
9490098890