అవి మళ్లీ నేరాలేనా?

Are they crimes again?– ఆ సెక్షన్ల పునరుద్ధరణకు పార్లమెంటరీ ప్యానెల్‌ సిఫారసు చేసే అవకాశం
న్యూఢిల్లీ : భారత్‌లో స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలు మళ్లీ నేరాల కిందకు రానున్నాయా? కేంద్రం అటు వైపుగా చర్యలు తీసుకుంటున్నదా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. దీంతో పై అంశాల గురించి చర్చించే భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) నుంచి తొలగించబడిన సెక్షన్‌ 377, సెక్షన్‌ 497 ల పునరుద్ధరణపై ప్రస్తుతం చర్చ నడుస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలోని హౌం వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే చట్టం (తొలగించబడిన సెక్షన్‌ 497) తిరిగి తీసుకురావాలనీ, ఇందులో లింగ తటస్థ నిబంధనను తేవాలని తన డ్రాఫ్ట్‌ నివేదికలో సిఫారసు చేసింది. అలాగే ప్రకృతి క్రమానికి వ్యతిరేకమైన లైంగిక కార్యకలాపాల (పురుషులు, మహిళలు, ట్రాన్స్‌పర్సన్స్‌ లలో స్వలింగ సంపర్కం) ను నేరంగా పరిగణించే సెక్షన్‌ 377 (ఇది ప్రస్తుతం నేరం కాదు) కూడా తీసుకురావాలని ప్రతిపాదించినట్టు సమాచారం. సెక్షన్‌ 377, సెక్షన్‌ 497 లు రాజ్యాంగ విరుద్ధం, స్వలింగ సంపర్క, వివాహేతర సంబంధాలు నేరాలు కావంటూ 2018లో భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన విషయం విదితమే.