ఏందిరా రాజన్న రెండు దినాల నుంచి కంటిగ్గ నవడ్తలేవు. యాడబోయినవురా? అవును మీ కొడుక్కు పాణం మంచిగలేదని తెలిసింది గిప్పుడెట్లున్నడురా? మంచిగున్నడా? అయినా ఎప్పుడు వానలు గొడుతయో, ఎప్పుడు ఎండలు గొడుతయో తెల్వకుంటున్నదిరా? శెడగొట్టు వానలు గొడుతాన్నై. కాలం కట్టుదప్పిందట్టే గిదేనేమోరా? సరెలేరా..గీ ముచ్చట తర్వాతగని మన సంగతేందిరా? మనమే గెలుత్తాన్నమని మనోళ్లందరూ ఎంత ధైర్యం జెప్పినా… లోపల బుగులుగుందిరా? ఏమోరా ఈసారి ఎప్పుడు లేనంత రంది మోపైంది. రాత్రి కునుకువడ్తలేదు. దినాం పొద్దువోత లేదు. ఇంక పదైదుదినాలు ఎట్ల గడుత్తయో తెలుత్తలేదురా! అవురా మనం గెలుస్తమంటవా? జెర సొచాయించి జెప్పు. గా నాలుగూళ్ల మీద జెర అనుమానంగుందిరా? మన పార్టీ బలంగున్నా, మనోళ్లే లోపల లోపల వేరే పార్టోళ్లకు సపోర్ట్ జేశిర్రని తెలిశింది. గదేం పద్ధతిరా? ఎంత వాళ్ల కులపోల్లయితే మాత్రం పార్టీని ముంచుతరంట వారా? ఏ జెప్పత్తలేదురా ఎవడెటేశిండో ఓటు..మనతోనే తిరుక్కుంటా మనకిందికే నీళ్లు తెచ్చిడ్రంటవారా? అయినా మనకే గాదురా… వేరే పార్టోల్లగ్గూడా మంది మస్తుగచ్చిండ్రు గదరా? పొద్దుగాల్ల మనతోని తిరిగిండ్రు, మాపటీలి మందితోని తిరిగిండ్రు…గీల్లంతా ఎవలకోటేశిర్రంటవురా? ఏడికివోయినా కడుపు గడుక్కున్నర్రు, జేబు నింపుకున్నరు. గీ జనం గిట్ల తయారైండ్రేందిరా? అయినా జనాన్ననుడు మన తప్పేరా, ఆల్లనట్ట తయారు జేసింది మనమేరా!
– ఊరగొండ మల్లేశం