డబ్బులు తీసుకుని పొగుడుతున్నారా?

ఆస్కార్‌ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం రూ.80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ బడ్జెట్‌ తాను కనీసం 8 సినిమాలు తీస్తానంటూ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రమోషన్స్‌ను ఉద్దేశిస్తూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ప్రపంచ వేదికపై మన తెలుగు సినిమా సత్తా చాటుతున్నందుకు గర్వపడాలన్నారు. సరైన సమాచారం లేకుండా ఖర్చుల గురించి ఎలా కామెంట్స్‌ చేస్తారని రాఘవేంద్రరావు ప్రశ్నించారు. ‘తెలుగు సినిమా, సాహిత్యం, దర్శకుడు, నటీనటులకు మొదటిసారి ప్రపంచ వేదికలపై వస్తోన్న పేరు ప్రఖ్యాతులు చూసి గర్వపడాలి. అంతేకానీ రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి మీ దగ్గర అకౌంట్స్‌ ఏమైనా ఉన్నాయా?, జేమ్స్‌ కామెరూన్‌, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ వంటి దిగ్గజ దర్శకులు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా?’ అంటూ దర్శకేంద్రుడు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై రాఘవేంద్రరావుతోపాటు నాగబాబు, ఇంకా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.