– సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
”కాళేశ్వరం ప్రాజెక్టులో కిషన్‌రెడ్డికి కమీషన్లు తక్కువైనట్టున్నరు” అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందిస్తూ..’నీ ఆస్తులేంటో? నా ఆస్తులేంటో విచారణకు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి ఎలా సంపాదించారో, ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటో? తన రాజకీయ ప్రస్థానం ఏంటో తెలంగాణలోని ప్రతి బిడ్డకూ తెలుసన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఎందుకు విచారణ కోరడం లేదని నిలదీశారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి 15 రోజులు కాకముందే ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అహంకారంతో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గజదొంగలకు యముడు మోడీ అనీ, అవినీతిపరులెవ్వరినీ ఆయన వదలబోరని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకే ఆరు గ్యారంటీల దరఖాస్తుల తంతుకు తెరలేపారన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులివ్వలేదన్న సంగతి తెలిసి కూడా పథకాల కోసం దాని వివరాలు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. రైతు భరోసా, గ్యాస్‌సిలిండర్లు, మహిళా సంఘాల డేటా మొత్త రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందనీ, మళ్లీ దరఖాస్తుల సేకరణ ఎందుకని నిలదీశారు. ఉద్యమకారులు జైలుకెళ్లడం, అరెస్టు కావడం, తదితర వివరాలున్న తర్వాత కూడా ఎఫ్‌ఐఆర్ కాపీలను అడగటమంటే వారిని అవమానించడమేనన్నారు. రాహుల్‌గాంధీ ఫెయిల్యూర్ పొలిటిషియన్, ఎక్స్‌పైర్ మెడిసిన్ అని విమర్శించారు. ఆయన జీవితంలో ప్రధాని కారన్నారు. బీఆర్‌ఎస్ అవుట్‌డేటెడ్ పార్టీ అనీ, అది ఫామ్‌హౌస్ పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్రంలో బిచాణా ఎత్తేసినట్టేననీ, ఎంపీ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్‌కు, తమకేనని చెప్పారు. అయోధ్యలో ఈ నెల 22న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్యార్యక్రమం కోసం ప్రతి దేవాలయంలో ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ ముందు నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలుంటాయన్నారు.