చేతులు వణకడం సర్వసాధారణమైన విషయం. మనలో చాలా మందికి ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్య ఎదురయ్యే ఉంటుంది. అయితే వయసు మళ్లిన తర్వాత ఈ సమస్య కనిపించడం కామనే అయినా చిన్నతనంలో కూడా చేతులు వణుకుతుంటే మాత్రం జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చేతులు వణకడానికి అసలు కారణం ఏంటి.? ఇది దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..
చేతులతో పాటు.. తల, గొంతు వణకడాన్ని ఎసెన్షియల్ ట్రెమర్‌గా పిలుస్తుంటారు. సాధారణంగా ఈ సమస్య వయసు మళ్లిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది జన్యుపరమైన సమస్యగా చెబుతుంటారు. అయితే కుటుబంలో అంతకుముందు ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
పార్కిన్సన్స్ వల్ల కూడా చేతులు, కాళ్లు వణుకుతుంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో శరీర కదలికలపై నియంత్రణ తగ్గుతుంది. దీనికి సకాలంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. సరైన చికిత్సతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
చేతులు వణకడానికి హైపర్ థైరాయిడిజం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. చేతుల్లో వణుకు, వేగవంతమైన హదయ స్పందన, ఉన్నట్టుండి బరువు తగ్గడం వంటివి హైపర్ థైరాయిడిజం లక్షణాలుగా చెప్పొచ్చు.
కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా కూడా చేతులు వణుకుతాయని నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన ఒత్తిడితో ఉన్న సమయంలో శరీరంలోని నరాలు, కండరాలపై ప్రభావం పడుతుంది. దీంతో చేతుల్లో వణుకు మొదలవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే యోగా, ధ్యానం వంటి అలవాట్లను చేసుకోవాలి.
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారితోపాటు, డ్రగ్స్ అలవాటు ఉన్న వారిలో కూడా చేతులు వణకడం సాధారణంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి నరాలతో పాటు కండరాలను ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగానే చేతులు వణుకుతాయి. మద్యం అలవాటు ఉన్న వారిలో ఈ సమస్య కనిపిస్తే వెంటనే మద్యం తీసుకోవడం ఆపేయాలి.