అజీర్తితో బాధపడుతున్నారా?

అజీర్తితో బాధపడుతున్నారా?ఎక్కువ తిన్నా ఇబ్బందే.. తక్కువ తిన్నా ఇబ్బందే.. ఏ రకంగా తిన్నా అనారోగ్య సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. కారణం జీర్ణసంబంధిత సమస్యలు. తిన్న ఆహారం సరిగా జీర్ణం అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ, ప్రస్తుత కాలంలో చాలా వరకు జీర్ణ సంబంధిత సమస్యలతోనే సతమతం అవుతున్నారు. ఫలితంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అజీర్తి, అసిడిటీ, మలబద్దకం, కడుపు ఉబ్బరం, గ్యాస్‌, గుండెల్లో మంట వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ.. ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అందుకే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మరి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పురాతన కాలం నుంచి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిని రెగ్యూలర్‌ ఫుడ్‌గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే.. సెలెరీని ఆహారంగా తీసుకోవడం వల్ల పొత్తికడుపు నొప్పి, గ్యాస్‌, వాంతులు, అజీర్తి, అసిడిటీ వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఒకవేళ మీరు అజీర్తితో బాధపడుతుంటే.. కేవలం సెలెరీ, నల్ల ఉప్పు, అల్లం కలిపి మెత్తగా నూరి భోజనం తర్వాత తినండి.
పొట్ట మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, పుదీనా టీ కూడా తాగవచ్చు. పుదీనా జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించే అనేక యాంటీ బాక్టీరియల్‌, క్రిమినాశక లక్షణాలను అందిస్తుంది. ఇది మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.
పెరుగు తినడం వల్ల కూడా ఉదర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. పెరుగులో ప్రోబయోటిక్స్‌ ఉంటాయి. ఇది తినడం వల్ల అన్ని రకాల ఉదర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే రోజూ తాజా పెరుగును తీసుకోవాలి.
పుచ్చకాయ చాలా ఆరోగ్యకరమైన పండు. దీనిలో ఉండే హైడ్రేటింగ్‌, యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు, విటమిన్లు, ఖనిజాలు ఉదర సంబంధిత సమస్యలను అధిగమించడానికి సహాయపడతాయి. ఇందులో నీరు పుష్కలంగా ఉంటుంది.
తిన్న తర్వాత వెంటనే పడుకోవద్దు. అలా చేస్తే శరీరంలోని కేలరీలు బర్న్‌ అయ్యే అవకాశం ఉండదు. దాంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవాలి. అయితే రన్నింగ్‌, జాగింగ్‌, వ్యాయామం లాంటివి చేయొద్దు. కేవలం 15 నిమిషాల పాటు అటూ ఇటూ నడిస్తే ఉపయోగం ఉంటుంది.