అలసటగా వుందా..?

Are you tired?కొందరు మహిళలు తరచూ అలసటకు గురవుతుంటారు. ఒక్కసారిగా కలిగిన అలసట.. చాలా రోజుల వరకు వారిని వీడదు. చిన్నపని చేసుకోవడానికి కూడా బద్ధకంగా అనిపిస్తుంది. కాలు కదపకుండా హాయిగా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. ఇలా అకస్మాత్తుగా మహిళలను అలసట ఆవరించి.. రోజుల తరబడి బద్దకస్థులని చేయడానికి గల కారణమేంటో తెలుసా..
సమయం: కొందరు ప్రతి నిమిషం విలువైనదిగా చూస్తారు. దాంతో తీరిక లేకుండా పని చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇది శరీరం, మెదడు పైన తెలియని ఒత్తిడి కలిగిస్తుంది. అప్పుడే విరామం అవసరమని అర్థం చేసుకోవాలి. కాసేపు నిద్రకు సమయాన్ని కేటాయించి చూడండి.
కలిసిమెలిసి: కొందరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. దాంతో ఫోన్‌ వినియోగం ఎక్కువ. దీని ప్రభావం అకస్మాత్తుగా శరీరంలో శక్తి అంతా తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపితే మనసు తేలికవుతుంది.
ఒత్తిడికి దూరంగా: తెలియకుండానే మనసుని ఒత్తిడికి గురి చేస్తాం. అనవసర విషయాలకి ప్రాధాన్యం ఇస్తాం. ఇవన్నీ చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. ఏది ముఖ్యం అనే అవగాహన ఉంటే చాలు.
వ్యాయామం: రోజూ అరగంటసేపు చేసే వ్యాయామం, ధాన్యం వంటివి చేస్తే మనసును ప్రశాంతంగా మారుస్తాయి. ఉదయంపూట, అలాగే రాత్రి నిద్రపోయేముందు పది నిమిషాలు చేసే ధ్యానం మంచి నిద్రను తెచ్చిపెడుతుంది.
అలవాటు: ప్రతి ఒక్కరికీ అభిరుచులు ఉంటాయి. చిత్రలేఖనం, పుస్తకపఠనం, క్రీడలు, మొక్కల పెంపకం వంటివెన్నో ఉంటాయి. వాటిలో మనసుకు నచ్చింది ఎంచుకొని రోజూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ అలవాటు మనసుకు వ్యాయామంగా మారుతుంది.
ప్రయాణం: కొత్త ప్రాంతాన్ని పర్యటించి రావడం లేదా బాల్యంలో తిరిగిన ప్రాంతాలను చూసి రావడం వంటివి మనసును తేలికపరుస్తాయి. అలాగే స్నేహితులను కలవడం, వారితో చిన్నప్పటి జ్ఞాపకాలను చర్చించడం చేస్తే మానసిక సంతోషం దరి చేరుతుంది.