పదేండ్లు అధికారంలో మీరే కదా..

State IT Minister Duddilla Sridhar Babu– వంద రోజుల పాలకులను అడగటం బాధాకరం
– ఫోన్‌ ట్యాపింగ్‌లో అందరూ బయటకు వస్తారు
– బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌
– సర్వేల ఆధారంగానే కాంగ్రెస్‌ ఎంపీ టిక్కెట్లు : మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వంద రోజుల్లో కాంగ్రెస్‌ పాలకులు ఏం చేశారని పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించడం బాధాకరమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో ప్రతి ఒక్కరు బయటకొస్తారని తెలిపారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలకు అనుమానాలు అక్కర్లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌గా మారిందని విమర్శించారు. సర్వేల ఆధారంగానే కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఎంపీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వంశీని అందరం కలిసి కట్టుగా పని చేసి గెలిపిస్తామన్నారు. బుధవారం హైదరాబాద్‌ బేగంపేటలోని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు వినోద్‌, వివేక్‌ వెంకటస్వామి, విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రాజ్‌ ఠాగూర్‌తో కలిసి శ్రీధర్‌బాబు విలేకర్లతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌లో పడాల్సిన వర్షాలు పడలేదని తెలిపారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ సర్కారు అధికారంలో ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి నీటి నిర్వహణ చేసేసామర్థ్యం లేదనడం సరైంది కాదన్నారు. కేసీఆర్‌ హయాంలో ప్రతి రైతుకు అన్యాయం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోలు కోసం ఐకెపీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒక్క గింజ వదిలిపెట్టకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నట్టు తెలిపారు. రుణమాఫీ కూడా చేస్తామని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేసిందనీ, దాన్ని ప్రణాళికాబద్ధంగా సరిదిద్దుతున్నట్టు పేర్కొన్నారు. కేటీఆర్‌ నోటీసులు ఇచ్చుకుంటే ఇచ్చుకో అని ఎద్దేవా చేశారు. తాము పద్ధతి ప్రకారం పని చేస్తామన్నారు. మిషన్‌ భగీరథ తప్పుడు స్కీమ్‌ అని, తాము తెచ్చిన తాగునీటి వ్యవస్థను కొనసాగించ కుండా కేసీఆర్‌ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ చదువుకున్న విద్యావంతుడని చెప్పారు. వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకుని ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారు. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి ప్రజలను కోరారు.