జూన్‌ 6న అరిబండి లక్ష్మీనారాయణ ఐదో స్మారకోపన్యాసం

– ముఖ్యవక్త ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ : రైతు సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మారుతున్న ప్రపంచం-వాతావరణ పరిస్థితులు, జాతీయ వ్యవసాయ విధానం అనే అంశంపై రాష్ట్రస్థాయి సెమినార్‌ జూన్‌ ఆరో తేదీన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, అరిబండి ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్ట్‌ డాక్టర్‌ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సెమినార్‌కు సంబంధించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆ సెమినార్‌లో ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌, అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ విజ్జు కృష్ణన్‌ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. వానాకాలం సాగు అంశంపై సెమినార్లో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అగ్రికల్చర్‌ మేనేజ్మెంట్‌ డైరెక్టర్‌ దేవీప్రసాద్‌ జువ్వాడి, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అల్దాఫ్‌ జానయ్య, అఖిల భారత కిసాన్‌ సభ సీనియర్‌ నేత సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలపై ఈ సెమినార్లో చర్చిస్తారన్నారు. వానాకాలంలో రైతాంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు సూచనలు చేస్తారని అన్నారు. కార్పొరేట్‌ సంస్థలు విత్తనం నుంచి మార్కెట్‌ వరకు దాడి చేస్తున్నాయని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంపై సమగ్రంగా చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ తీసుకుంటామన్నారు. ఈ సెమినార్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.