– మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగల్లు ముద్దుబిడ్డ, పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. దీప్తికి అభినందనలు తెలిపారు. గురువారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మానసిక సామర్థ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, కుంగిపోకుండా విధిని ఎదిరించి తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిన అథ్లెట్ దీప్తి జీవాంజి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఆమెకు తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీనిచ్చారు. దీప్తి మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడారంగంలో అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. ఈ మధ్యే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కప్ పేరుతో పోటీలు నిర్వహించి గ్రామీణుల్లో దాగిన ప్రతిభను వెలికితీస్తున్నామని తెలిపారు. త్వరలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని తీసుకొచ్చి తెలంగాణను క్రీడారాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.