డీఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Armed arrangements for the conduct of DSC examination– హాజరుకానున్న 4440 మంది అభ్యర్థులు
– నేటి నుండి ఆగస్టు 5 వరకు కొనసాగనున్న పరీక్ష
– పరిశీలకులుగా ఇద్దరు అధికారుల నియామకం
నవతెలంగాణ-  నల్గొండ కలెక్టరేట్
ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షకు జిల్లా విద్యాశాఖ పకడ్బం దీగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జులైలో మొదటి డీఎస్సీ నిర్వహించారు. తర్వాత ఏడేళ్లకు నిర్వహిస్తున్న రెండో పరీక్ష ఇది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించే పరీక్షకు  నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో  4440 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వీరి కోసం జిల్లా కేంద్రంలోని రామగిరి లో గల ఎస్పీఆర్ పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని  ఏర్పాటు చేశారు. రోజుకు 185 మంది అభ్యర్థులు 24 షిఫ్ట్ లలో 12 రోజులపాటు పరీక్ష రాయనున్నారు. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ (సిబిటి) విధానంలో పరీక్షలు జరగనున్నాయి. మొదటి విడత ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. నల్లగొండ జిల్లా విద్యాశాఖ  అధికారి బిక్షపతిని పర్యవేక్షణ అధికారిగా నియమించారు. కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా పరిశీలకులుగా సెక్టోరియల్ అధికారి ఆర్. రామచంద్రయ్య, గజిటెడ్ హెడ్మాస్టర్ సైదానయక్ ఇద్దరు అధికారులను నియమించారు.
అధికారులకు సూచనలు..
జిల్లా విద్యాశాఖ అధికారి, డీఎస్సీ పరీక్షల పర్యవేక్షణ అధికారి బిక్షపతి  జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ స్కూల్లో ఏర్పాటు చసిన  పరీక్ష కేంద్రాన్ని మంగళవారం తనికి చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండి కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయించారు. డీఎస్సీ పరీక్ష ల నిర్వహణ పట్ల తగు సలహాలు, సూచనలు అధికారులకు అందజేశారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్ష సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
రెండు గంటల ముందే చేరుకోవాలి: బిక్షపతి (డిఇఓ) డీఎస్సీ పరీక్షల పర్యవేక్షణ అధికారి
డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకోవాలి. నిర్ణీత సమయానికి గంటన్నర ముందు నుంచే లోపలికి అనుమతిస్తారు. పది నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు కార్డు, బాల్పాయింట్ పెన్ను వెంట తెచ్చుకోవాలి. గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, నిబంధనల్లో పేర్కొన్నవి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. అభ్యర్థులు పరీక్ష హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. హాల్ టికెట్ లో ఇంటి పేరు పడి, పూర్తి పేరు పడని అభ్యర్థులు ఏదైనా ఒరిజినల్ సర్టిఫికెట్ ను వెంట తెచ్చుకోవాలి. అదేవిధంగా హాల్ టికెట్ పై ఫోటో పడని అభ్యర్థులు ఫోటోను వెంట తెచ్చుకోవాలి.