స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Adilabad,NavatelanganaNews,TeluguNews,Telangana,TelanganaNewsనవతెలంగాణ – ఆదిలాబాద్‌టౌన్‌
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించనున్నందున వేదిక, సీటింగ్‌ ఏర్పాట్లు పక్కాగా చేయాలని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్‌, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం తదితర శాఖల శకటాల ప్రదర్శనతో పాటు స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. గృహజ్యోతి, మహాలక్ష్మి, రూ.500కు గ్యాస్‌ కనెక్షన్‌, రైతు రుణ మాఫీ, రైతు భరోసా, వన మహోత్సవం తదితర పథకాలపై శకటాలు, స్టాల్స్‌ ఉండాలన్నారు. ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక అధికారులు ఉదయం తమతమ మండలాలు, గ్రామాలలో జెండా ఆవిష్కరణ జరిపి, జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని తెలిపారు. ప్రత్యేక అధికారులు అందుబాటులో లేని పక్షంలో మండల కేంద్రాలలో ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు జెండావిష్కరణ చేయవచ్చని సూచించారు. సమర్థవంతంగా విధులు నిర్వహించిన వారికి ఉత్తమ ఉద్యోగుల ఎంపిక కోసం శాఖల వారీగా నిర్ణీత గడువులోపు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యామలదేవి, ట్రైనీ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాలవీయ, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.