తెలంగాణ సాయుధ పోరాటం… రైతులు లిఖించుకున్న చరిత్ర. భూమికై.. భుక్తికై… వెట్టి చాకిరి విముక్తికై… కమ్యూనిస్టులు చేసిన త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం. దోపిడీపై సాగించిన ప్రజాయుద్ధం. ఆ యుద్ధక్షేత్రంలో ‘ఆకాశంలోని సగమూ’ పాల్గొంది. తమవంతు పాత్ర మహిళాలోకం పోషించింది. సామాజికంగా అణగారిన స్త్రీలలో దాగున్న పోరాట పటిమకు ఈ పోరాటం ఓ తార్కాణం. ‘బాంచన్ దొర నీ కాల్మొక్తా’ అన్న నోటితోనే ‘నీ గోరి కడతా కొడకా’ అంటూ సివంగుల్లా విరుచుకుపడ్డారు. ఎర్రజెండా చేతబూని పోరుబాటలో కదం తొక్కారు. సంప్రదాయ సంకెళ్లను తెంచుకుని శత్రువులను తరిమికొట్టారు. కాకులు దూరని కారడవిలో, చీమలు దూరని చిట్టడివిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ పురుషులకు ధీటుగా నిలబడ్డారు. ఆ భీకరపోరులో తుపాకి పట్టి కిరాతక సైన్యంపై పోరాడిన వీరవనితలు కొందరైతే… పరోక్షంగా అండగా నిలబడ్డ ధీరలు కోకొల్లలు.
‘తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకు నేందుకు ఆ కిరాతక సైనికుల దౌర్జన్యంపై స్త్రీలు చూపిన దీక్ష ప్రతిఘటన, పోరాట పటిమ మనలను ఉత్తేజపరుస్తాయి. అవన్నీ తలచుకుంటే ఆర్థికంగా, సామాజికంగా అణగారిన మన స్త్రీ జాతిలో ఎంతటి విప్లవదీక్ష, శక్తి ఇమిడి ఉన్నాయోనని ఆశ్చర్యానం దాలు కలుగుతాయి. వారిని సాంప్రదాయ సంకెళ్ల నుండి విడిపించి, నిద్రాణమైన ఆ శక్తిని రగుల్కొల్పేందుకు కొంచెం శ్రమ తీసుకోవాలే గానీ, ఎంతటి శక్తివంతమైన తిరుగుబాటునైనా తీసుకురాగలం’ అంటారు పుచ్చలపల్లి సుందరయ్య
ఆనాడు నైజాం ముష్కరులు, రజాకార్లు, నెహ్రూ సైన్యం జరిపిన అమానుష చిత్రహింసలకు ఎక్కువగా బలైంది స్త్రీలే. కమ్యూనిస్టుల జాడ చెప్పమంటూ చింతబరిగెలతో ఒళ్లు చిట్లిపోయేలా కొట్టారు. చెప్పుకోలేని మాటలతో అవమానించారు. వారి కండ్ల ఎదుటే కన్న పిల్లలను, భర్తలను, అన్నదమ్ములను చిత్ర హింసలు పెట్టారు. లైంగికంగా హింసించారు. అన్నింటినీ పంటి బిగువన భరిస్తూ లక్ష్యం కోసం నిలబడ్డారు. అదురూ బెదురూ లేక చేతికి చిక్కిన వాటినే ఆయుధాలుగా చేసుకున్నారు. అన్యాయంపై తిరగబడ్డారు. తమ కోసం త్యాగాలు చేస్తున్న కమ్యూనిస్టులను కడుపులో పెట్టి కాపాడుకున్నారు. అంతటి గొప్ప చరిత్ర ఆ ధీర వనితలది.
వినూత్న చైతన్యంతో…
శత్రువుల దుర్మార్గాల నుండి తప్పించుకునేందుకో, దళాల్లో చేరేందుకో, రహస్య జీవితం గడిపేందుకో ఇండ్లను వదిలి తమ మగవారు వెళ్లిపోతే అన్నింటినీ కాపాడుకునే బాధ్యత ఆనాడు స్త్రీలపైనే పడింది. అంతే కాదు అడవుల్లో నుంచి, చిన్న చిన్న గూడేల నుంచి కోయ, చెంచు మొదలైన వారందరినీ తరిమివేసే ‘బ్రిగ్స్’పథకానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పురుషులతో సమానంగా పాల్గొన్నారు. నాటివరకు చూపని వినూత్న చైతన్యంతో, సరికొత్త మార్పుతో ఉద్యమబాట పట్టారు.
దళ కమాండర్లుగా…
నైజాం, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన ఈ సుదీర్ఘపోరాటంలో మహిళలు సైతం దళాల్లో చేరారు. ఎంతటి కష్టమొచ్చినా వెన్ను చూపక కొరియర్లుగా, రాజకీయ ఆందోళనకారులుగా బాధ్యతలు నిర్వర్తించారు. రహస్య జీవితాన్ని అనుభవించారు. అలాంటి వారిలో మనకు బాగా సుపరిచితమైన వారు మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవితో పాటు మరెందరో. వారిలో రంగక్క(కె.సత్యవతి) ఒకరు. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లాలోని చివ్వెంల ప్రాంతంలో పుట్టారు. దళ కమాండర్‌గా తెలంగాణ సాయుధ పోరాటంలో మహబూబ్‌నగర్ జిల్లాను వణికించారు. ఈమె పోరాటం గురించి స్వయంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అసెంబ్లీలో ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఆమె పోరాట పటిమ ఎలాంటితో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు.
ప్రచార కార్యకర్తలుగా…
ప్రత్యక్షంగా దళంలో పాల్గొనకపోయినా పరోక్షంగా పోరాటం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వారు ఎందరో. వారిలో నల్గొండ జిల్లాలో తుంగతుర్తి నియోజవర్గానికి చెందిన ప్రియంవద ఒకరు. సాయుధ పోరాటంపై ప్రజల్లో విస్కృతంగా ప్రచారం చేశారు. ఊరుగుట్టపై నిలబడి సెంట్రీగా పనిచేశారు. మూడేండ్లు జైలు జీవితం గడిపారు. అలాగే భువనిగిరి తాలూకాలోని శరభనానాపురం గ్రామానికి చెందిన కట్కూరు సుశీలాదేవిది మరో చరిత్ర. చదువుతున్న రోజుల్లోనే సాయుధ పోరాటానికి ఆకర్షితురాలయ్యారు. గర్భవతిగా ఉండి జైలు జీవితం అనుభవించారు. నల్గొండ జిల్లాలోని సిరసనగండ్లకు చెందిన కట్టబోయిన జానకమ్మ దళాల మధ్య కొరియర్‌గా పని చేశారు. పోరాట విరమణ తర్వాత ఉద్యమంలోనే కొనసాగుతూ మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఐద్వా డివిజన్ అధ్యక్షురాలిగా పదేండ్లు పనిచేశారు. సూర్యాపేట తాలుకా కొత్తపల్లి గ్రామానికి చెందిన లలితమ్మ మెట్టినింట అడుగుపెట్టడంతోనే సాయుధ పోరాటంలో అడుగుపెట్టారు. జైలుకెళ్లినా అక్కడ సైతం నిరాహరదీక్ష చేసి పోరాటాన్ని కొనసాగించారు.
భూమిని కాపాడుకునేందుకు…
విసునూరు దేశ్‌ముఖ్ దురాక్రమణకు గురికాకుండా తన భూమిని నిలబెట్టుకునేందుకు ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీల సహకారంతో మొదట తీవ్రంగా పోరాడింది చిట్యాల ఐలమ్మ. అలాగే మిర్యాలగూడెం, ముకుందా పురంలో ఓ షావుకారు కుమ్మరి మట్టయ్యను భూమి స్వాధీనం చేయమని బెదిరించాడు. అతను అంగీకరించకపోవడంతో చిత్రహింసలు పెట్టి చంపేశాడు. అప్పుడు అతని భార్య గ్రామస్తుల సహకారంతో పోరాటం చేసి భూమిని దక్కించుకుంది. వాడపల్లి, కొండిపోలులోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. వీరారం గ్రామంలో ఓ గిరిజన రైతు, అతని భార్య కలిసి భూస్వామి గుండాలను, పోలీసులను ఎదిరించగా పోలీసులు గర్భిణిగా ఉన్న ఆమె పొట్టపై కాలేసి తొక్కి చంపేశారు.
కూలి పెంపునకు…
కొండపల్లి పరిసర ప్రాంతాల్లో కూలి రోజుకు రెండు లేక మూడు శేర్ల ధాన్యం ఇచ్చేవారు. దాన్ని నాలుగు శేర్లకు పెంచాలని కూలీలు సమ్మె చేశారు. స్త్రీలు కూడా ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూస్వాములు లొంగి ఆ కూలికి ఒప్పుకునే వరకు అవిశ్రాంతంగా పోరాడారు. పిండిప్రోలు, ఇల్లందు పరిసర ప్రాంతాల్లో 90 గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సమ్మెలు జరిగాయి. ఈ గ్రామాల్లో జరిగిన పోరాటాల్లో స్త్రీలే ముందున్నారు. అనేక ప్రాంతాలపై సైన్యం దాడి చేసినప్పుడు వారిని వడిశెలతో ప్రతిఘటిస్తున్న పురుషులకు పక్కనే నిలబడి రాళ్లందించారు. ఆ సమయంలో మల్లారెడ్డిగూడెంలో ఓ స్త్రీ బలైపోయింది. ఇలాంటి పోరాటంలోనే గాజులంకలో వియ్యమ్మ అనే మరో మహిళ చనిపోయింది. గోదావరి అడవుల్లో గుండాల కోయగూడెంలో పోలీసులు మగవాళ్లను పట్టుకెళుతున్నారని తెలిసి పది గూడాలలోని మహిళలు వారిని అడ్డుకుంటారు. కాల్పులు ప్రారంభిస్తే భయపడి పారిపోకుండా చెట్ల చాటున నిలబడి పోలీసులపై రాళ్లు రువ్వుతారు. వారి పోరాట పటిమకు భయపడి పోలీసులే పారిపోతారు.
గెరిల్లా దళాలకు అండగా…
గెరిల్లా దళాలు, పార్టీ నాయకులు తమ ఇండ్లల్లో తలదాచుకుంటుంటే స్త్రీలు విషయం బటయకు పొక్క నీయకుండా వుండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. దళాలు ఎంత రాత్రి వేళ వచ్చినా ఆప్యాయంగా భోజన సదుపాయాలు చూసేవారు. వారు నిద్రిస్తుంటే రాత్రంతా కాపలా కాసేవారు. అడవుల్లో, గుట్టల్లో ఉండే దళాలకు ఆహారం అందించేవారు. ఒకవేళ పోలీసులకు చిక్కితే చిత్రహింసలు అనుభవించేవారే తప్ప దళాల జాడచెప్పేవారు కాదు. అలాంటి వారిలో వృద్ధ విప్లవ నారి దూడల సాలమ్మ ఒకరు. దళ నాయకుల జాడచెప్పమంటూ మైసూరు పోలీసులు ఈమెను నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. అలాగే రాజారాం కేంద్రంలో గిరిజన దంపతులు దళాలకు సహకరిస్తున్నారని చిత్రవధ చేశారు. కానీ వారి నుండి ఒక్క నిజాన్ని కూడా రాబట్టలేకపోయారు. నేరేడు గ్రామంలోని డెబ్బయి మంది మహిళలను పట్టుకొని చింతబరిగెలతో రక్తం కారేలా కొడతారు. అంతటితో ఆగక వారికి పైజమాలు తొడిగించి పాదాల వద్ద గట్టిగా కట్టి తొండలను వదిలారు. గాయాలపై కారం చల్లారు. బెండపాడు గ్రామంలో రాజ మ్మ అనే రైతు రొమ్ములు, మెడ, చేతులపై వాతలు పెట్టారు. స్త్రీలను నిర్బంధించి పిల్లలకు పాలివ్వకుండా చేశారు. లచ్చమ్మ, జైనాబీ, హాము-మంగలీ, మల్లికాంబ, ఎర్రమ్మ, రాంబాయమ్మ, వెంకమ్మ, ఇలా ఎందరో వీరవనితలు. పోరాటంలో భర్తలను పోగొట్టుకున్న భార్యలు, బిడ్డలను పోగొట్టుకున్న తల్లులెందరో. వెట్టిచాకిరి విముక్తికై అన్నీ భరించారు. దళాలకు అండగా నిలిచారు. అమ్మలుగా అక్కున చేర్చుకొని ఆకలి తీర్చారు.
నవాబుల కాలం చెల్లింది. రజాకార్లు కనుమరు గయ్యారు. బ్రిటీషోళ్లు పారిపోయారు. కానీ మహిళలపై హింస, దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఇక సమానత్వం, సాధికారత కంటికి కానరానంత దూరంలో ఉంది. మొన్నటికి మొన్న కోల్‌కతాలో మహిళా డాక్టర్‌పై జరిగిన అమానుష ఘటన దీనికి తాజా ఉదాహరణ. మహిళల భద్రత నేడు కూడా సవాలుగా మారింది. చోద్యం చూస్తున్న ప్రభుత్వాలను నిలదీయాల్సిన సమయమిది. రైతాంగ పోరాటంలో ఆ వీర వనితల తెగువ మనకు స్ఫూర్తి కావాలి. హింసకు వ్యతిరేకంగా పోరాడే చైతన్యం పొందాలి. అదే వారి త్యాగాలకు మనమిచ్చే నిజమైన నివాళి.