– పార్లమెంట్ నిర్ణయానికి అధ్యక్షని ఆమోద ముద్ర
యెరెవన్ : అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చేరాలన్న పార్లమెంట్ నిర్ణయాన్ని ఆర్మేనియా అధ్యక్షుడు వాగన్ కచతురయాన్ ఆమోదించారు. దీనివల్ల పాత మిత్రుడు రష్యాతో సంబంధాలు మరింత దెబ్బతింటాయి. ఐసిసిని ఏర్పాటు చేసిన రోమ్ ఒప్పందాన్ని ధృవీకరించడం ద్వారా ఐసిసిలో చేరడానికి గత వారం ఆర్మేనియా పార్లమెంట్ 60-22 తేడాతో ఓటు వేసింది. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశంలో అడుగు పెడితే అరెస్టు చేయడానికి కట్టుబడాల్సి వుంటుంది. ఉక్రెయిన్ చిన్నారులను బలవంతంగా తరలించి యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఐసిసి పుతిన్ అరెస్టుకు వారంటు జారీ చేసింది.
కాగా ఆర్మేనియా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని శత్రు చర్యగా పుతిన్ అభివర్ణించారు. ఆర్మేనియా రాయబారిని రష్యా విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. అయితే తమ దేశంలోకి ప్రవేశిస్తే పుతిన్‌ను అరెస్టు చేయబోమని హామీ ఇవ్వడానికి అర్మేనియా ప్రయత్నించింది. అయితే రష్యాకు ఈ చర్యతో ఎలాంటి సంబంధం ఏమీ లేదని ఆర్మేనియా అధికారులు వాదిస్తున్నారు. తమ దేశంపై అజర్‌బైజాన్ దూకుడు నేపథ్యంలో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.