సియోల్ : యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన అధినేత జోసెప్ బోర్రెల్ తో ఉక్రెయిన్ కు ఆయుధ సరఫరా అంశం గురించి అసలు చర్చించనే లేదని దక్షిణ కొరియా రక్షణ మంత్రి, లీ జోంగ్-సప్ ఆదివారం మీడియాకు చెప్పారు. అంతకు ముందు సింగపూర్ లో జరిగిన షంగ్రిలా భద్రతా సమావేశం జరిగినప్పుడు బోర్రెల్ తనకు లీ తో మంచి సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశంలో ఉత్తర కొరియా రెచ్చగొట్టటం గురించి, ఉక్రెయిన్ ఆయుధ సహాయం గురించి చర్చించినట్టు ఆయన పేర్కొన్నారు. దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వశాఖ అటువంటిది ఏమీ జరగలేదని ప్రకటించింది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు కావలసిన ఆయుధాల గురించి బోర్రెల్ వివరించటం మినహా ఏమీ జరగలేదని దక్షిణ కొరియా ప్రకటించింది. దక్షిణ కొరియా ఎదురు తిరగటంతో బొర్రెల్ తను పోస్ట్ చేసిన ట్వీట్ ను డిలీట్ చేశారు. ఆ తరువాత పోస్టు చేసిన మరో ట్వీట్ లో ”ఉక్రెయిన్ ఆయుధ అవసరాలను నేను వివరించాను” అని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరి నెలలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్ప టినుంచీ దక్షిణ కొరియా ఉక్రెయిన్ కు వందల మిలియన్ డాలర్ల ఆర్థిక, మానవతా సహాయం అందించింది తప్ప ఆయుధ సరఫరా చేస్తానని అనలేదు. అయితే ఏప్రిల్ నెలలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యెవోల్ తన వైఖరి మారినట్టు సంకేతాలను ఇచ్చారు. ఉక్రెయిన్ కు వందల వేల ఫిరంగి గుండ్లను సరఫరా చెయ్యటానికి అమెరికాతో దక్షిణ కొరియా ఒక రహస్య ఏర్పాటు చేసుకున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక రాసింది. ఆ నివేదికపైన స్పందిస్తూ అది వాస్తవాలకనుగుణంగా లేదని దక్షిణ కొరియా అధికారులు అన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించటానికి మాత్రమే ఉపయోగపడే పశ్చిమ దేశాల ఆయుధ సరఫరాను రష్యా పదేపదే ఖండిస్తోంది. దక్షణ కొరియా ఉక్రెయిన్ కు ఆయుధ సరఫరా చేయటాన్ని ‘బహిరంగ రష్యా వ్యతిరేక చర్య’గా భావిస్తామని ఏప్రిల్ నెల చివరలో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా హెచ్చరించింది.