ఇంఫాల్ : మణిపూర్‌లో ఆర్మీ అధికారి కిడ్నాప్ అయ్యారు. ఆయన స్వగృహం నుంచే దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. మణిపూర్‌లోనే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గత ఏడాది మేలో సరిహద్దు రాష్ట్రంలో జాతిహింస ప్రారంభమైనప్పటి నుంచి అధికారులు కిడ్నాప్‌కి గురవుతున్నారు. కిడ్నాప్‌కి గురైన ఆర్మీ ఆఫీసర్ పేరు కొన్సామ్ ఖేదా సింగ్. ఇతను తౌబల్ జిల్లాకు చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జెసిఓ). ఖేదా సింగ్ తన ఇంట్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. అతన్ని వాహనంలో తీసుకెళ్లారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. తమకు సమాచారం అందిన వెంటనే సెక్యూరిటీ ఏజెన్సీల సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ చేశాము. 102 నేషనల్ హైవేపై ఉన్న అన్ని వాహనాల్ని తనిఖీ చేస్తున్నాము. అయినప్పటికీ ఖేదాసింగ్ కనిపించలేదు. అసలు అతన్ని ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు తెలియదు. దానిపై పరిశీలిస్తున్నాము అని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది మే 2023 నుండి ఇది నాల్గో సంఘటన. సెలవుల్లో ఉన్న సైనికులు, విధుల్లో ఉన్నవారు లేదా వారి బంధువల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 2023లో అస్సాం రెజిమెంట్ మాజీ సైనికుడు సెర్టో తంగ్‌తంగ్‌కోమ్‌ని గుర్తు తెలియని సాయుధ బృందం కిడ్నాప్ చేసింది. అతను కూడా సెలవుల్లో ఉండి తన ఇంట్లో ఉన్నప్పుడే కిడ్నాప్‌కి గురయ్యాడు. ఆ తర్వాత రెండు నెలల తర్వాత చురాచంద్‌పూర్ నుండి లీమాఖోంగోకు ఎస్‌యూవీలో ప్రయాణిస్తుండగా.. గుర్తుతెలియని సాయుధ బృందం నలుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి చంపింది. ఆ నలుగురు జమ్మూకాశ్మీర్‌లో పనిచేస్తున్న భారత ఆర్మీ సైనికుని కుటుంబ సభ్యులే. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన మణిపూర్ డిఎస్‌పిని కొద్దిసేపు కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని అరాంబై టెంగోల్‌లో పోలీసులు గుర్తించారు.