600 మందితో నిమజ్జనానికి బందోబస్తు ఏర్పాటు

 Adilabad– బాణసంచాకు అనుమతి లేదు
– 200 సీసీ కెమెరాలతో నిఘా
– డిఎస్పీ జీవన్‌ రెడ్డి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
జిల్లాలో వినాయకుల నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని పట్టణంలో 600 మంది సిబ్బందితో నిమజ్జన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి అప్రమత్తతో జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా ఎస్పీ గౌష్‌ ఆలం ఐపిఎస్‌ ఆదేశాల మేరకు బందోబస్తు ప్రక్రియను 24 గంటలు అప్రమత్తతతో పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణంలో దాదాపు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం ఈ వీడియోగ్రఫీ నిర్వహిస్తూ, ప్రత్యేకంగా నిమజ్జనం రోజులలో డ్రోన్‌ కెమెరాలతో నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులకు ఫైర్‌ క్రాకర్స్‌, బాణా సంచాలను పేల్చడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ప్రమాద సంభవించే అవకాశం ఉన్నందున వాటికి అనుమతి లేదని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారిపై పోలీసు చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అదేవిధంగా డీజే ల యజమానులకు పోలీసు పరిమితిని మించి సౌండ్‌ సిస్టం లను ఏర్పాటు చేయకూడదని సూచించారు. ఏర్పాటు చేసిన వారి ఓనర్లపై యజమానులపై చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. డీజెలలో ప్రత్యేకంగా లేజర్‌ లైట్‌ లను ఉపయోగించకూడదని వాటి వల్ల కళ్ళు పోయి అందత్వం వచ్చే ప్రమాదం ఉన్నందున వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వైర్ల వద్ద జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.
పట్టణంలో ట్రాఫిక్‌ ఆంక్షలు
నిమజ్జనం రోజున ట్రాక్టర్‌ వాహనాలు నడిపే వ్యక్తులు, డ్రైవర్లు మద్యం సేవించకూడదని పేర్కొన్నారు. ట్రాక్టర్‌ యజమానులు వారి డ్రైవర్ల పై శ్రద్ధ వహిస్తూ మద్యం సేవించకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రత్యేకంగా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టును నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిమజ్జనం రోజున యువత మద్యం సేవించి వాహనాలను నడపకూడదు అని పేర్కొన్నారు. ప్రత్యేకంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. నిమజ్జనం రోజున సాయంత్రం సమయంలో ర్యాలీ ప్రారంభం అయిన తర్వాత ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నందున పట్టణంలోని వినాయక్‌ చౌక్‌, దేవిచంద్‌ చౌక్‌, గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌక్‌, నేతాజీ చౌక్‌, శివాజీ చౌక్‌ ప్రదేశాల నందు, మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నందున భారీ వాహనాలు, ఫోర్‌ వీలర్స్‌ లకు అనుమతి లేదని పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకొని తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. పట్టణంలో దాదాపు 600 మంది సిబ్బందితో బందోబస్తు ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో 11 క్లస్టర్లు, ఏడు సెక్టర్లు, ఫుడ్‌ పెట్రోలింగ్‌ పార్టీ, ఆరుగురు డిఎస్పీలు ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు పాల్గొంటూ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని పేర్కొన్నారు.