నవతెలంగాణ-నిర్మల్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు, శకటాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు, జర్నలిస్టులు, విద్యార్థులు, ప్రజలకు ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వికలాంగులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, టెంట్, కుర్చీలు వంటి ఏర్పాట్లను చేయాలన్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.