నవతెలంగాణ – తాడ్వాయి
వచ్చే నెల ఫిబ్రవరి 12 నుండి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు. గురువారం తాడ్వాయి మండలం లోని మేడారంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆకస్మిక పర్యటించి క్యూలైన్, జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అంతేగాకుండా జన సందోహం అధికంగా ఉండే ప్రాంతాలైన చిలుకలగుట్ట శివరంసాగర్ చెరువు, ఆర్టీసీ బస్టాండ్, రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి ప్రదేశాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ మేడారం జాతరను పురస్కరించుకొని ప్రతిరోజు వేలాది మంది భక్తులు వనదేవతలను (అమ్మవార్లను) దర్శించుకుంటున్నారని, ఈ సందర్భంలో పారిశుద్ధ్యం లోపించకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచాలని సూచించారు. భక్తులు క్యూ లైన్ లో గద్దెల ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తోపులాట జరగకుండా చూసుకోవాలని, అక్కడ త్రాగునీటి ఏర్పాటు చేయాలని, గద్దెల ప్రాంతం తో పాటు పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జంపన్న వాగు ప్రాంతంలో పుణ్య స్థానాలు ఆచరించిన అనంతరం మహిళలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ శుభ్రమైన మంచి నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి ఓంటేరు దేవరాజ్, ఎంపి డి ఓ సుమన వాణి, పంచాయితి కార్యదర్శి కొర్నెబెల్లి సతీష్, తదితరులు పాల్గొన్నారు.