నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి అన్ని రకాలుగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం హైదరాబాద్‌లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టీనా చొంగ్తూ ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఆయుష్ విభాగం డైరెక్టర్ ఎం.ప్రశాంతి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ వాణి, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల పాల్గొన్నారు. 2023తో పోలిస్తే 2024లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే రిస్క్ ఉన్న హైరిస్క్ జిల్లాలను గుర్తించి ఎక్కడికక్కడ ప్రత్యేకంగా సమీక్షించాలని ఆయా విభాగాధిపతులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఆరోగ్య అధికారులు, పంచాయతీ సెక్రెటరీలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని కోరారు.