
– మేడారంలోని అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన
నవతెలంగాణ -తాడ్వాయి
మేడారం మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ ఎ శరత్ అన్నారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డా ఎ శరత్, డైరెక్టర్ ఇ వెంకట్ నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి లతో కలిసి, మేడారంలో చేపడుతున్న పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం మేడారం లోని సమక్క భవనం (ఆదివాసీ భవనం) లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ శరత్ మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పూర్తయిన పనులు భక్తులు అధికంగా ఇప్పటినుండే వస్తున్నందున అందుబాటులోకి తేవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పార్కింగ్ స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు, ఫ్లడ్ లైట్లు, త్రాగునీరు, టాయిలెట్ తదితర అన్ని చర్యలు చేపట్టాలన్నారు. మేడారం దాని పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలన్నారు. భక్తులకు చేపడుతున్న సౌకర్యాల కల్పనలో రాజీపడవద్దని, ప్రతి అంశంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. స్టాళ్ళ వద్ద డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పనులలో వేగం పెంచి చక్కగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, జాతరను విజయవంతం చేయాలన్నారు.
సివిల్ పనులు మరో ఏడు రోజుల్లో పూర్తి కానున్నట్లు, రద్దీ నిర్వాహణ పై దృష్టి పెట్టాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో ఫ్లడ్ లైట్లు, బ్యాటరీ ట్యాప్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని, విఐపి, వివిఐపి పార్కింగ్ కేంద్రం మధ్య రోడ్ ను చదును చేయాలన్నారు. ప్రతి కేంద్రానికి ఒక మంచి పేరుతో సైన్ బోర్డ్, గేట్, ఎన్ని కార్లు పార్కింగ్ చేయొచ్చు వివరాలు ప్రదర్శించాలని అన్నారు. జంపన్నవాగులో లోతున్న ప్రాంతాలు గుర్తించి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక లెవలింగ్ సక్రమంగా చేయాలని అన్నారు. అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర వైద్యo కొరకు వీలయినంత ఎక్కువ సంఖ్యలో మినీ అంబులెన్స్ సిద్దంగా ఉంచాలన్నారు. వివిధ దేశాల, రాష్ట్రాల, దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు జాతర మధుర జ్ఞాపకంగా ఉండాలన్నారు. డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి మాట్లాడుతూ అధికారులు ఎవరికి కేటాయించిన విధులు వారు సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. బారికెటింగ్ ఏర్పాటు లో పోలీస్ శాఖ తో సమన్వయం చేసుకోవాలన్నారు. భక్తులకు సౌకర్యార్థం ప్రతిచోటా సైన్ బోర్డులు, సలహాలు, సూచనలు ఇచ్చి, అధికారులు ఒక టీమ్ లా పనిచేసి, జాతరను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశం లో ఎస్పీ శబరిష్, ఐటిడిఎ పి ఓ అంకిత్, అదనపు కలెక్టర్లు పి శ్రీజ, సి వేణు గోపాల్, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఓ ఎస్ డి అశోక్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపి డి ఓ లు, ఎంపి ఓ లు, తదితరులు పాల్గొన్నారు.