సామాగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాట్లను పూర్తి చేయాలి..

 – అదనపు కలెక్టర్ శ్రీనివాస్
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అధికారులు ఆదేశించారు. శనివారం ఆయన వరంగల్,ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టబధ్రుల ఉప ఎన్నికలకు సంబంధించి నల్గొండ జిల్లా ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సెయింట్ ఆల్ఫాన్స్ పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి, ఇతర స్టాచ్యుటరీ మెటీరియల్ అందజేసేందుకుగాను అవసరమైన హెల్ప్ డెస్క్ ను, చైర్స్, బ్యాలెట్ బాక్స్ లు ఉంచుకునేందుకు స్థలాన్ని ఏర్పాటు చేయాలని, రెండు లాప్టాప్ లు సిద్ధంగా ఉంచుకుని అవసరమైన సమాచారం అంతటిని పోలింగ్ సిబ్బందికి తెలిసే విధంగా చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా  పోలింగ్ విధులకు హాజరైన సిబ్బంది సంతకాలు తీసుకుని అటెండెన్స్ రిజిస్టర్ను నిర్వహించాలని, ప్రతి కౌంటర్ కు కూలర్, తాగునీరు, మజ్జిగ వంటివి ఏర్పాట్లు చేయాలని, ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆర్డిఓ రవి, స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ లను ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది సకాలంలో పంపిణీ కేంద్రానికి హాజరై పోలింగ్ సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లే విధంగా అవసరమైన వాహనాలు అన్ని ఏర్పాట్లను చూడాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డిఓ రవి, తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.