కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..

– వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు ఆదేశాలు….
– తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్: కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. మంగళవారం నాడు కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ జూన్ 4వ తేదీన పార్లమెంటు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సందర్భంగా చేపట్టాల్సిన చర్యల గురించి ఆయన పలు సూచనలు చేశారు. ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ సిబ్బందిని కేటాయించాలని, కౌంటింగ్ రోజున ఉదయం 6 గంటల వరకు అందరూ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకునేలా చూడాలని, ఈ మేరకు అభ్యర్థులు, వారి తరఫున హాజరయ్యే ఏజెంట్లకు కూడా సమాచారం అందించాలని సూచించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును ప్రారంభించాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని సదుపాయాలు కౌంటింగ్ సెంటర్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా విద్యుత్ అంతరాయం తలెత్తకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి శిక్షణ తరగతుల సందర్భంగా స్పష్టమైన అవగాహన కల్పించాలని, ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాలను రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించే సమయంలో తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కౌంటింగ్ సెంటర్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్  హనుమంతు కే.జండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర,  అదనపు కలెక్టర్లు పి.బెన్ షాలోమ్, కే.గంగాధర్, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి అమరేందర్,  జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.