
నవతెలంగాణ- గోవిందరావుపేట
పంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని గ్రామపంచాయతీ కార్మిక జేఏసీ మండల కార్యదర్శి సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్ లో సతీష్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇల్లు ముట్టడిలో భాగంగా చలో పాలకుర్తి వెళ్లే సమయంలో ముందస్తుగా గ్రామపంచాయతీ ఉద్యోగులను గోవిందరావుపేట మండలం పసర పోలీసులు అరెస్టు చేయడం జరిగిందన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అంతకంతకు ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుంది అన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. అతివేతకు పాల్పడ్డ నియంతలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారని వీరికి కూడా చివరికి అదే గతి పడుతుంది అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగినట్లు గుణపాఠం చెబుతారని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో సూరారపు రాజు జన్ను సమ్మక్క సంపత్ మోరభాగ్య పంచాయతీ సిబ్బంది ఉన్నారు.