– మాదాపూర్ డీసీపీ సిపి వినీత్
నవతెలంగాణ-మియాపూర్
తాను పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగం నుంచి తీసేశారనే కసితో అదే కంపెనీకి చెందిన ఆఫీస్‌పై నకిలీ సీఐడీ ఆఫీసర్లమంటూ సోదాలు నిర్వహించి, అనంతరం ఆ సంస్థ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటనకు పాల్పడిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ సీపీ వినీత్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిమెర మహేంద్ర కుమార్, షేక్ మొహమ్మద్ అబ్దుల్ క్వాదిర్‌తో పాటు విజరు శేఖర్, రంజిత్ కుమార్, తదితరులు పదిమంది ముఠాగా ఏర్పడ్డారు. కాగా, కర్నాటకకు చెందిన దర్శన్ సుగుణాకర శెట్టి, శ్రీకాంత్, అర్జబ్ సేన్‌తో కలిసి గచ్చిబౌలిలోని జనార్ధనహిల్స్‌లో ఏర్పాటుచేసిన ఏజేఏ యాడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీపై ఈ ముఠా సభ్యులు.. ఆంధ్రప్రదేశ్ సీబీసీఐడీ అధికారులమంటూ దాడిచేశారు. ఈ నెల 26న మధ్యాహ్నం 1.30 గంట సమయంలో కంపెనీలోకి చొరబడగా.. కంపెనీ యజమాని సుగుణాకర శెట్టి వారిని ఎవరని ప్రశ్నించగా ఏపీ సీఐడీ(సైబర్ క్రైమ్)లో సహాయ దర్యాప్తు అధికారి షేక్ అబ్దుల్ ఖాదిర్‌గా తన గుర్తింపు కార్డు చూపించాడు. ఎందుకొచ్చారని అడగగా.. అమెరికా ప్రభుత్వం నుంచి కేంద్ర హౌంశాఖకు ఫిర్యాదు వచ్చిందని, ఏజేఏ యాడ్స్ తప్పుడు పనులు చేస్తోందని ఫిర్యాదు వచ్చిందని చెబుతూ కొన్ని ఈ- మెయిళ్లు చూపించారు. మరో వ్యక్తి వచ్చి వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటే ఇక్కడితోనే ముగిసిపోతుందని చెప్పారు. దాంతో సుగుణాకరశెట్టి తన వద్ద పనిచేసే కపిల్‌ను వారితో మాట్లాడాలని సూచించారు. మొదట రూ.10 కోట్లు డిమాండ్ చేసి బేరసారాల అనంతరం రూ.71.80 లక్షలు ఇస్తామనడంతో సుగుణాకరశెట్టి, కపిల్, రవిని వారు కారులో ఎక్కించుకొని మాదాపూర్‌లోని ఒక హౌటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ గదిలో బాధితులను బంధించి వారి ఖాతాల నుంచి డబ్బును క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లలోకి బదిలీ చేసుకున్నారు. కపిల్‌ను బయటకు పంపించి డెబిట్ కార్డుల ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకురావాలని సూచించారు. కొద్దిసేపటి తర్వాత కపిల్ ఫోన్ ఎత్తకపోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గది నుంచి బయటపడ్డ సుగుణాకరశెట్టి, రవి తర్వాత బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయగా మొత్తం రూ.13.70 లక్షలు బదిలీ చేయించుకున్నట్టు గుర్తించారు. దాంతో బాధితులు నిందితులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ ఖాదిర్ సహా నలుగురిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.