– సల్మాన్ ఖుర్షీద్ భార్యకు ప్రత్యేక కోర్టు షాక్
– ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై తాజా ఆదేశాలు
లక్నో: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూయిస్ ఖుర్షీద్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆమెకు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ విషయంలో ఆమెతో పాటు మరో ఇద్దరికి ఈ వారెంట్‌ను జారీ చేస్తూ ప్రత్యేక కోర్టు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేటు శాంభవి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేశారు. 2009-10లో ఒక ట్రస్ట్ తాత్కాలిక అవయవాలు, పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యుటర్ అచింత్య ద్వివేది తెలిపారు. ఇందులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావటంతో ఈ విషయంపై ప్రభుత్వం దర్యాప్తు జరిపించింది. సదరు కార్యక్రమంలో నకీలీ సీల్స్, సంతకాలతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్టు తేలిందని అచింత్య ద్వివేది చెప్పారు. దీనిపై 2017లో భొజిపుర పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టరైందన్నారు. లూయీస్ ఖుర్షీద్‌తో పాటు మరొకరి పేరును ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చారు. ఇద్దరు నిందితులకు వ్యతిరేకంగా పోలీసులు కోర్టులో చార్జీషీటును సైతం దాఖలు చేశారు. ఆ తర్వాత కోర్టు వారికి పలుసార్లు సమన్లు పంపింది. అయితే, వారు ఈ కేసులో కోర్టుకు హాజరు కావటం కానీ, బెయిల్ పొందటం కానీ చేయకపోవటం గమనార్హం.