అరెస్టులు, అక్రమ కేసులు ఉద్యమాలను ఆపలేవు

Arrests are illegal cases Movements cannot be stopped– పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడుతాం
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ
– కరీంనగర్‌ జైలునుంచి విడుదలైన భూపోరాట నాయకులకు ఘన స్వాగతం
నవతెలంగాణ – కరీంనగర్‌
అక్రమ కేసులు, బెదిరింపులు, అరెస్టులు.. ఉద్యమాలను ఆపలేవని, పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు దక్కేంత వరకూ అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఐక్యంగా ఉద్యమిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ స్పష్టంచేశారు. జగిత్యాల జిల్లాలో పేదల ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేసిన లెల్లల బాలకృష్ణ, తిరుపతి నాయక్‌, రజియా సుల్తానా 38 రోజులుగా కరీంనగర్‌ జైల్లో ఉండి, గురువారం విడుదలయిన సందర్భంగా వారికి సీపీఐ(ఎం) రాష్ట్ర, కరీంనగర్‌ జిల్లా నాయకత్వం పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ, కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేసిన నాయకులు, పేదలపై అక్రమంగా కేసులు పెట్టి 38రోజులుగా జైల్లో నిర్బంధించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా జైలు జీవితం గడిపి విడుదలైన లెల్లల బాలకృష్ణ, తిరుపతి నాయక్‌, రజియా సుల్తానాను వారు అభినందించారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను వదిలేసి, పేదలకు ఇంటి జాగాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్న వారిని ప్రభుత్వం నిర్బంధించడం హేయమైన చర్య అని అన్నారు. కొంతమంది స్థానిక ప్రజా ప్రతినిధులు కక్షపూరితంగా ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలనే కుట్రతో పేదలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేదలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, అర్హులైన పేదలందరికీ భూములు పంచి ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పుప్పాల శ్రీకాంత్‌, గోరెంకల నర్సింహ, కరీంనగర్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు డి.నరేష్‌ పటేల్‌, నాయకులు లెల్లల భవాని, కొప్పు పద్మ, జి.రమేష్‌, చంద్రయ్య, వెంకటచారి, రఫిక్‌, వినోద్‌, గజ్జల శ్రీకాంత్‌, నవీన్‌, గణేష్‌తో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.