హామీలు అమలు చేయకుండా అరెస్టులు చేయడమేంటి?

– మాజీ మంత్రి టి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి టి హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అని తెలిపారు. సోకాల్డ్‌ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా?అని ప్రశ్నించారు. ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ, నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు రేవంత్‌ సర్కార్‌ పాల్పడుతున్నదని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు. ”అప్రజాస్వామ్యపాలన.” అని విమర్శించారు. ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థికి తీసుకు వచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలనీ, నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.