28న ఆదిలాబాద్ జిల్లాకు బీసీ కమిషన్ బృందం రాక

Arrival of BC Commission team to Adilabad district on 28th– ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఈ నెల 28న జిల్లాకు రానున్నారని   కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ కార్యక్రమం ఈ నెల 28న ఆదిలాబాద్  జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీ.సీ వెల్ఫేర్ కమిషనర్లతో కూడిన బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం దీనికి సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శ్యామలదేవితో కలసి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..  అభిప్రాయాలు తెలియజేయాలనుకునే వారు రాతపూర్వక సమర్పణలు, అభ్యర్థనలను నేరుగా సమర్పించవచ్చని సూచించారు. వారి అభ్యర్థనలతో పాటు నిర్దేశిత నమూనాలో వెరిఫికేషన్ అఫిడవిట్  ఆరు సెట్లను తెలుగు లేదా ఆంగ్ల భాషలో ఇవ్వాల్సి ఉంటుందని, వారి వాదనలకు మద్దతుగా వారి వద్ద ఉన్న సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలను, సంబంధిత కేసుల వివరాలను పేర్కొంటూ, సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను కమిషన్ కు నివేదించవచ్చని సూచించారు.  కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి ఆర్డీఓ వినోద్ కుమార్, డిబిసిడిఓ రాజలింగు, డిహెంహెచ్ఓ కృష్ణ, జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డిఎల్పీఓ, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.