29న నిజామాబాద్ కు బీసీ కమిషన్ బృందం రాక

– కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
రాష్ట్రంలో చేపట్టబోయే కులాల గణన పై ఆయా పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటైన తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుల బృందం ఈ నెల 29న నిజామాబాద్ కు విచ్చేయనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 29 న నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కుల గణనపై కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీ.సీ వెల్ఫేర్ కమిషనర్లతో కూడిన బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని వెల్లడించారు. ఆయా కులాల స్థితిగతులపై కమిషన్ బృందానికి ప్రజలు, వివిధ సంఘాల వారు, రాజకీయ పార్టీల బాధ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు.