– సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ అహంకారం, అవినీతి, అప్రజాస్వామిక విధానాలపై ప్రజలిచ్చిన తీర్పు అని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు.పాలకులకు ఇది కనువిప్పుగా ఉండాలని భావిస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కడం, అంతులేని అహంకారం, దురహంకారంతో అప్రజాస్వామిక విధానాలను అనుసరించడం, నిరంకుశ, అవినీతి విధానాలు, నిరుద్యోగ సమస్యలు,ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల బీఆర్‌ఎస్ పరాజయం పాలైందని తెలిపారు. స్వయంగా కేసీఆర్‌నే ఒకచోట ఓడించడం ప్రజల్లో తీవ్రంగా ఏర్పడిన నిరసనకు నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంల మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల హైదరాబాద్‌లో భయం, భ్రమలు కల్పించడం వల్ల ఆ మాత్రం సీట్లలో ఆయా పార్టీలు గెలిచాయని వివరించారు. ఈ కూటమి ప్రజావ్యతిరేకంగా రానున్న కాలంలో ఉంటుందని గమనించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గెలుపును మతోన్మాద, ఫాసిస్టు కూటమిపై ప్రజలు, ప్రజాస్వామిక గెలుపుగా భావిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామికంగా, లౌకికత్వంతో సమస్యలను పరిష్కరించే విధంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.