అర్షదీప్‌ అదుర్స్‌

అర్షదీప్‌ అదుర్స్‌– 4 వికెట్లతో విజృంభించిన సింగ్‌
– అమెరికా స్కోరు 110/8
సింగ్‌ ఈజ్‌ కింగ్‌. యువ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ (4/9) నిప్పులు చెరిగాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాను వణికించాడు. పదునైన పేస్‌, స్వింగ్‌తో బంతులను బుల్లెట్లుగా సంధించిన అర్షదీప్‌ సింగ్‌ అమెరికాను స్వల్ప స్కోరుకు పరిమితం చేశాడు. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న యుఎస్‌ఏ 20 ఓవర్ల పాటు క్రీజులో నిలిచినా 110/8 పరుగులే చేసింది.
నవతెలంగాణ-న్యూయార్క్‌
భారత పేసర్లు అర్షదీప్‌ సింగ్‌ (4/9), హార్దిక్‌ పాండ్య (2/14) వికెట్ల వేటలో విజృంభించారు. అర్షదీప్‌ సింగ్‌ 9 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌ పాండ్య సైతం 14 పరుగులకే రెండు వికెట్లు కూల్చాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా (యుఎస్‌ఏ) 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. నితీశ్‌ కుమార్‌ (27, 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), స్టీవెన్‌ టేలర్‌ (24, 30 బంతుల్లో 2 సిక్స్‌లు) అమెరికాను ఆదుకున్నారు.
ఇక ఛేదనలో భారత స్టార్‌ క్రికెటర్లు, ఓపెనర్లు విరాట్‌ కోహ్లి (0), రోహిత్‌ శర్మ (3) మరోసారి విఫలమయ్యారు. కోహ్లి వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో తేలిపోగా.. రోహిత్‌ శర్మ సైతం అతడి బాటలోనే నడిచాడు. ఓపెనర్ల వైఫల్యంతో పవర్‌ప్లేలో భారత్‌ రెండు వికెట్లకు 33 పరుగులు మాత్రమే చేసింది.
అర్షదీప్‌ అదరహో.. : టాస్‌ నెగ్గిన టీమ్‌ ఇండియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. న్యూయార్క్‌ నాసా కౌంటీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ముచ్చటగా మూడో మ్యాచ్‌ ఆడుతున్న రోహిత్‌సేన.. ఆతిథ్య అమెరికాపై ఛేదనకు మొగ్గు చూపించింది. బౌలింగ్‌ దాడిని మొదలెట్టిన అర్షదీప్‌ సింగ్‌ వికెట్ల వేటను సైతం షురూ చేశాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే అమెరికాకు కోలుకోలేని షాక్‌ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికి జహంగీర్‌ (0), ఓవర్‌ ఆఖరు బంతికి స్టీవెన్‌ ఆండ్రీస్‌ గౌస్‌ (2)ను డగౌట్‌కు సాగనంపాడు. తొలి ఓవర్లో 3 పరుగులకే ఇద్దరు కీలక బ్యాటర్లను కోల్పోయిన అమెరికా ఒత్తిడిలో పడింది. పవర్‌ప్లేలో సిరాజ్‌, బుమ్రాలను ఎదుర్కొని అమెరికా వికెట్ల పతనానికి బ్రేక్‌ వేసినా.. తొలి ఆరు ఓవర్లలో ఆ జట్టు 18 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌ పూర్తిగా భారత్‌ నియంత్రణలోకి వచ్చినట్టు అయ్యింది!. స్టీవెన్‌ టేలర్‌ (24, 30 బంతుల్లో 2 సిక్స్‌లు), ఆరోన్‌ జోన్స్‌ (11, 22 బంతుల్లో 1 సిక్స్‌) మూడో వికెట్‌కు 22 పరుగులు జోడించారు. కానీ రన్‌రేట్‌ అప్పటికే చేజారిపోయింది. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేస్తున్న ఈ జోడీని హార్దిక్‌ పాండ్య విడదీశాడు. ఆరోన్‌ జోన్స్‌ను పాండ్య అవుట్‌ చేయగా.. అప్పటికే రెండు భారీ సిక్సర్లతో ఊపందుకున్న స్టీవెన్‌ టేలర్‌ను అక్షర్‌ పటేల్‌ ఖతం చేశాడు. టాప్‌ ఆర్డర్‌లో స్టీవెన్‌ టేలర్‌ పరుగుల వేటలో మెప్పించగా.. మిడిల్‌ ఆర్డర్‌లో నితీశ్‌ కుమార్‌ (27) ఆకట్టుకున్నాడు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కాడు. కోరే అండర్సన్‌ (15), హర్మీత్‌ సింగ్‌ (10), శాడ్లీ (11 నాటౌట్‌) ఆఖర్లో విలువైన పరుగులు జోడించారు. అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. అర్షదీప్‌ ప్రదర్శనతో ఓ దశలో పది ఓవర్ల పాటు నిలుస్తారా? అనిపించినా అమెరికా ఆఖరు వరకు పోరాట పటమి చూపించింది. హార్దిక్‌ పాండ్య రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీసుకున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, శివం దూబెలకు వికెట్లు దక్కలేదు.