కళ-కళాకారుడు

Cover Storyఏ పనినైనా సృజనాత్మకతను జోడించి చేస్తే అది కళ అవుతుంది. ప్రదర్శించేవారు కళాకారులు. జనజీవనంలో చతుష్షష్ఠి కళలు (64 కళలు)గా మనుగడలో గల అన్నింటిలోకెల్లా ఎక్కవగా ఆదరించేది లలిత కళలు మాత్రమే. అవి సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పం. చిత్రలేఖనంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ‘పాబ్లో పికాసో’ జన్మదినాన్ని అక్టోబర్‌ 25న అంతర్జాతీయ కళాకారుల దినోత్సవంగా జరుపుకుంటారు.
కళాకారులు అనే పదానికి అర్థం అన్ని రంగాల వారికీ వర్తిస్తుంది. సంగీతం, నృత్యం, నాటకం, ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం వెరసి అన్నింటినీ డిజిటలైజేషన్‌ చేయుట కూడా కళగానే గుర్తిస్తాం. ప్రదర్శన కళలలో నృత్య కళలది మరో ముఖ్యమైన భూమిక. ఈ సందర్భంగా నృత్య కళలు వివిధ సంప్రదాయ నృత్యాలను గూర్చి తెలుసుకుందాం.
నృత్తం – నృత్యం :
నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతం అని భరతముని నాట్యశాస్త్రంలో తెలుపబడినది. గతంలో జరిగిన ఏదైనా చరిత్ర లేదా ఇతిహాస గాథలను వివిధ పాత్రలతో సంగీత, సాహిత్య నృత్యాలను జోడించి ప్రదర్శిస్తే అది నాట్యమని అన్నారు. అందుకు ఉదాహరణే మన యక్షగానాలు మొదలైనవి. అలా కాకుండా కేవలం అడుగులను లయాత్మకంగా కదుపుతూ సాగే ప్రదర్శనలన్నీ ‘నృత్తం’ కిందకు వస్తాయి. ఉదాహరణకు ఒగ్గుడోలు నృత్యం, డప్పు నృత్యం మొదలైనవి. తాళం లయాత్మకంగానూ, రసాత్మకమైన భావాలను అభినయాన్ని జోడించి ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేదే ‘నృత్యం’ అనబడుతుంది.
ఇది కాకుండా నృత్య విన్యాసానికి అనుబంధంగా ‘లాస్యం’ – తాండవాన్ని పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు జోడించి పేరిణి నృత్యాన్ని అందించగా – నేడు తెలంగాణ శాస్త్రీయ నృత్యమై వర్ధిల్లుతున్నది.
భారతీయ నృత్య సంప్రదాయాలలో ఎందరో మహనీయులు వివిధ శాస్త్రీయ నృత్యాలను తమదైన శైలిలో ప్రదర్శించి విశ్వవిఖ్యాతులయ్యారు. మన శాస్త్రీయ నృత్యరీతులలో కూచిపూడి ఆంధ్రప్రదేశ్‌లో, భరతనాట్యం – తమిళనాడు రాష్ట్రంలోనూ, మోహినిఆట్టం, కథాకళి – కేరళలో, కథక్‌ నృత్యం – ఉత్తరప్రదేశ్‌, ఇక్కడ లక్నో ఘరానా – సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన శ్రీ బిర్జు మహారాజ్‌ ప్రసిద్ధి చెందినారు. అలాగే మణిపూర్‌ రాష్ట్రంలో మణిపురి నృత్యం, ఒరిస్సాలో – ఒడిస్సీ నృత్యం, అస్సాంలోని సత్రియా నృత్యం – పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌లలో ‘చౌ’ నృత్యం వంటివి విరాజిల్లుతున్నాయి.
శాస్త్రీయ నృత్యాలలో ప్రముఖులు:
వివిధ నాట్య రీతులలో విశిష్ట సేవలు అందించిన వారిని ఒకసారి స్మరించుకుందాం. ముఖ్యంగా భరతమునిచే రాయబడిందని చెప్పిన నాట్యశాస్త్రం ద్వారా భరతనాట్యంలో ప్రముఖులు పద్మభూషణ్‌ రుక్మిణీదేవి అరుండేళ్‌. అలాగే యామిని కృష్ణమూర్తి, ఆనంద్‌శంకర్‌ జయంత్‌, గీతాచంద్రన్‌, వైజయంతిమాల, శ్రీ మృణాళిని సారాబారు, భరతనాట్యం, కథాకళి నృత్యంలోనూ, కళామండలం, ఒడిస్సీ నృత్యంలో సోనాల్‌ మాన్‌సింగ్‌, కథక్‌ నృత్యంలో పండిత్‌ బిర్జుమహారాజ్‌, ఒడిస్సీ నృత్యంలో ప్రముఖులైన మాధవీ ముద్గల్‌, శ్రీ హరికృష్ణ బెహ్రా, కిరణ్‌ సెహగల్‌, రాణీ కర్ణ, మినాటి మిశ్రా, కుంకుం మహంత్‌, మోహన్‌ మహాపాత్ర మొదలగు వారు కలరు. మణిపూరి నృత్యంలో జావేరి సిస్టర్స్‌, అంజనా దర్శన, నయన, సువర్ణలు వంటి ప్రముఖులే కాకుండా మణిపూరి నృత్యంలో గురు బిపిన్‌ సింగ్‌, గురు ఆమ్లిబంగ్‌, నలకుమార్‌ సింగ్‌ వంటి వారు విశిష్టమైన సేవలందించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రీయ, శాస్త్రీయ నృత్యంలో పద్మభూషణ్‌ శ్రీ వెంపటి చినసత్యం, వారి తర్వాత శ్రీ రాధారెడ్డి, రాజారెడ్డి, శ్రీమతి శోభానాయుడు, ప్రొ|| ఉమారామారావు వంటి అనేకులు కలరు. ప్రస్తుతం సంగీత, నాటక అకాడమీ ఛైర్మన్‌గా ఆచార్య అలేఖ్య పుంజాల విశిష్ట సేవలందిస్తున్నారు. కేరళకు చెందిన ప్రముఖ నాట్యగురు స్వర్గీయ కనక్‌రేలే ప్రశస్తమైన పద్మశ్రీ, పద్మవిభూషణ్‌ అవార్డులు సాధించి అనేక సన్మానాలు కూడా పొందినారు. వీరే కాకుండా మోహినీ అట్టం నృత్యంలో ప్రముఖులు డా|| సునంద నాయర్‌, కళామండలం కళ్యాణికుట్టి, రాగిణి దేవి వంటి వారు ఎందరో ఉన్నారు. అస్సాంకు చెందిన సత్రియా నృత్యాన్ని వారి రాష్ట్రంలో స్థాపించి విస్తృత ప్రచారం గావించిన వారిలో శ్రీమంత శంకర్‌దేవ్‌, జతిన్‌ గోస్వామి, గహన్‌ చంద్ర గోస్వామి వంటి వారు ముఖ్యులు. భరతనాట్యం ఒడిస్సీ రెండు నాట్యాలలో ప్రతిభను చాటిన శ్రీమతి సోనాల్‌ మాన్‌సింగ్‌కి పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ అవార్డులు వరించాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పాండ్యాణి శాస్త్రీయ నృత్య కళాకారిణియైన శ్రీమతి తీజన్‌బాయికి, భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్‌లను ఇచ్చి సత్కరించింది. వీరే కాకుండా మరొక వినూత్న ప్రక్రియయైన ఫ్యూజన్‌ డ్యాన్స్‌ను ప్రపంచానికి అందించిన పద్మవిభూషణ్‌ శ్రీ ఉదరుశంకర్‌ కలరు.
వివిధ రాష్ట్రాల జానపద నృత్యాలు :
శాస్త్రీయ నృత్యాలే కాకుండా ప్రతి జానపద సంప్రదాయ నృత్యాలలోనూ ప్రముఖులు కలరు. భారతదేశంలోనూ ఆయా రాష్ట్రాలలోని జానపద కళారూపాలను గూర్చి తెలుసుకుందాం! ప్రతి రాష్ట్రంలోనూ కొన్ని సంప్రదాయ జానపద నృత్యాలు సందర్భానుసారంగా ప్రదర్శించబడతాయి. ఆనంద సమయాలలో, పండుగ సమయాలలో, గ్రామదేవతల జాతరలలో, కుటుంబ సంబంధమైన వేడుకలలో, కుల సంబంధమైనవి, ఔత్సాహితకమైనవి ప్రదర్శించబడతాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన బిహునృత్యం, బిచువా, నట్‌పూజ నృత్యాలు ఆంధ్రప్రదేశ్‌లోని థింసా నృత్యం, వీరనాట్యం, తప్పెట గుళ్లు, గరగనృత్యం, చెక్కభజన, గురవయ్యల నృత్యం, పులివేషాలు, డప్పు నృత్యం, నెమలి నృత్యం, ఉరుములు, కుంచె నృత్యం వంటివి నేటికీ విరాజిల్లుతున్నాయి. ఇలా పంజాబ్‌లోని బాంగ్రా నృత్యం, గిద్దా నృత్యం, గుజరాత్‌లోని గర్భా, దాండియా, కర్ణాటకలోని యక్షగానం, మణిపూర్‌లోని లరు హరోబా, మాసా నృత్యంతో పాటు యుద్ధవిద్యతో సంబంధమైన తాంగ్‌తా నృత్యం ప్రశస్తమైనది. రాజస్థాన్‌లోని కట్‌పుత్‌లీ, కాల్‌బేలియా, గూమర్‌, జామర్‌ వంటి నృత్యాలు, తమిళనాట కరగట్టం, మెయిలాట్టం, పామిడిహట్టం, కుమ్మినృత్యం, పులి ఆట్టం, పోయికల్‌ కుతిరై నృత్యం కలవు.
మహారాష్ట్రకు చెందిన లావణి, తమాషా వంటి కళారూపాలు, ఛత్తీస్‌గఢ్‌లోని పాండ్యని నృత్యం, రౌత్‌నాచా, కాశ్మీర్‌లోని రౌఫ్‌ నృత్యం, ఉత్తరప్రదేశ్‌లోని చుర్కులా, నౌటంకి, రాసలీలా నృత్యాలు, ఒరిస్సా రాష్ట్రంలో సావరీ, గుమ్రాతో పాటు పలు నృత్యాలు కలవు. ఉత్తరాఖండ్‌లోని కుమౌనీ, ఘర్‌వాలీ నృత్యాలు, గోవాలోని సిద్ధి, గోడా నృత్యం, జార్ఖండ్‌లోని జూమర్‌ థముండా నృత్యం, బీహార్‌ రాష్ట్రంలో ‘చౌ’ నృత్యం, విదేశియా నృత్యం, సిక్కిం రాష్ట్రంలోని – కుక్రి, సిక్మారీ, చూఫాట్‌ నృత్యం, చుట్కీ నృత్యం మనుగడలో కలవు. మిజోరాంలోని బాంబు డ్యాన్స్‌ – ఇలా రాష్ట్రాల వారీగా అనేక జానపద నృత్యాలు సందర్బానుసారంగా ప్రదర్శిస్తారు.
తెలంగాణ జానపద కళాసంపద :
గ్రామీణ కళా సంపదలో అనేక జానపద – గిరిజన నృత్యాలు కలవు. గ్రామీణ సంప్రదాయంలో వివిధ కులాలకు ఆశ్రిత కులాలు కలిగి, ఆయా కుల పురాణాలను, మనుగడకు సంబంధించిన ఆచార సంప్రదాయాలను గూర్చి ప్రదర్శనలు గావించుట ప్రతీతి. అందులో బ్రాహ్మణులకు, విప్రవినోదులు, నాయీ బ్రాహ్మణులకు, అద్దపు సింగం వారు (అద్దపు సింగని కథలు), ఆర్యవైశ్యులకు – వీరముష్టి వారు (కన్యకా పరమేశ్వరి కథలు), కాపు, రెడ్డి కులస్తులకు పిచ్చుగ కుంటుల వారు (రెడ్ల గోత్రాల కథలు), క్షత్రియులకు భట్టులు వందిమాగధుల స్తోత్రాలు చేస్తూ, గౌడ కులస్తులకు ఆశ్రిత కులస్తులైన గౌడ జెట్టీలు గౌడ పురాణాన్ని, గొల్ల, యాదవ కులస్తులకు ఆశ్రిత కులస్తులుగా మందెచ్చులు, తెరచీరల వారుగా కాటమరాజు కథలను గానం చేస్తూ ప్రదర్శిస్తారు. కురుమ వారికి బీరన్నలు, ఒగ్గోళ్లుగా మల్లన్న కథలు, విశ్వకర్మలకు రుద్రాంగులు అను పేర రుంజ కథలను గానం చేస్తారు. ముదిరాజ్‌ కులస్తులకు పాండవుల వారు, పాండవుల కథను పటం ద్వారా ప్రదర్శిస్తారు. పటం కథలతో ముఖ్యంగా కాకిపడి గల వారు తెనుగోళ్లకు మహాభారత కథలు, చాకలి వారికి మాచయ్య పటం కథ, మడేలయ్య పురాణం గానం చేస్తూ, వారి ప్రదర్శనలను గావిస్తారు. ఇలా పద్మశాలీలకు సాధనాశూరులు, మాదిగ కులస్తులకు చిందువారు, బైండ్ల వారు జాంబ పురాణం, ఎల్లమ్మ కథలను, ఆది జాంబ పురాణాన్ని మాష్ఠి, డక్కలి వారు, మాల వారి పోషణతో బుడిగె జంగాలు, గుఱ్ఱంపటం వారు, మిత్తులయ్య వార్లు వారి కథాగానం చేస్తూ జీవనం సాగించేవారు.
ఇలా ప్రతి కులంలోనూ దాతృత్వ కులం, వారికి ఆశ్రిత కులం కలిగి ఉండి వారి వారి కుల పురాణాలు, రాగయుక్తంగా ప్రదర్శించి మనుగడ సాగిస్తూ, వారి వారి సాంస్కృతిక పరంపరను నిలబెట్టుకోవడం నేటికీ ప్రతీతి.
ఇవి గాకుండా వ్యష్ఠి ప్రదర్శనలైన పోతరాజుల వీరంగం, తుపాకిరాముడు, ఎరుకలి సోది మొదలగు కళారూపాలు, స్త్రీల నృత్యాలైన బతుకమ్మ, బోనాలు, స్త్రీల కోలాటం వంటి ఔత్సాహిక కళలు, పురుషులకు చిరుతల రామాయణం వంటివి గ్రామాలలో నేటికీ సందర్భానుసారంగా కనిపిస్తాయి.
వీధి భాగవతులు, చిందు యక్షగానాలు, ఆధునిక వీధి నాటికలు మాత్రమే గాకుండా వివిధ వాద్య సంబంధ నృత్యాలైన ఒగ్గుడోలు నృత్యం, డప్పునృత్యం, కోలాటం వంటివి అనేకం కలవు. తోలు బొమ్మలాటలు, చెక్కబొమ్మలాటలు కూడా ఇంకా అక్కడక్కడా కనిపిస్తాయి.
నడుస్తున్న కాలానికి అనుగుణంగా పాశ్చాత్యీకరణ, ఆధునిక పోకడలు, సినిమా, నాగరిక జీవనం, టెక్నాలజీ వంటి కోణాలలో ఒక వైపు అభివృద్ధి జరుగుతూనే వివిధ కళారూపాలు మెల్లగా కనుమరుగు కావడం గమనించవలసిన విషయం. ఆధునిక పోకడలకు ధీటుగా ప్రదర్శనలు ఇవ్వలేక, ఆయా కళారూపాలు, కళాకారులు వారి అస్తిత్వాన్ని కోల్పోయి, మనుగడ సాగించలేక వేరు వేరు పనులలో నిమగమై జీవనం సాగించడాన్ని మనం తప్పుపట్టలేం. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పులకు ధీటుగా కొన్ని కళారూపాలు వాటి ప్రదర్శనను వైవిధ్యంగా మలచుకొని, ప్రచార, ప్రసార మాధ్యమాలుగా సాంఘిక జీవనంలోని ఆయా సమస్యలను తీసుకొని, సరికొత్త కథా వస్తువును సృష్టించుకొని జనాదరణ పొందటం వారి కళానైపుణ్యానికి తార్కాణం. ఔత్సాహిక గాయకులు, ఉద్యమ గాయకులు, జానపద సంగీతంలోని వివిధ బాణీలను వినూత్నమైన ప్రక్రియలో ఉపయోగించి పల్లెసుద్దులు, ఆధునిక వీధి నాటకాలు సృష్టించి తద్వారా ప్రభుత్వ ప్రజా పథకాలను ప్రచారం చేయుటకై ‘సాంస్కృతిక సారథులై’ మన సాంస్కృతిక వైభవాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా చాటిచెబుతున్నారు. పరిశోధకులు వారి ప్రావీణ్యతతో వివిధ కళలను అంతర్జాతీయ వేదికలపై విదేశాలలో కూడా ఎన్నో కార్యశాలు నిర్వహిస్తూ, విదేశాలలోని తెలుగువారిచే ప్రదర్శింప చేస్తున్నారు. ఏది ఏమైనా, నాటి సాంస్కృతిక వైభవాన్ని మళ్లీ చూడలేమేమో అన్న బాధ మాత్రం ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.
మానవాళికి శారీరక, మానసిక చైతన్యాన్ని కలిగించి, నైపుణ్యతను, సృజనాత్మకతను, సాంస్కృతిక పరంపరను నిలబెట్టే ఆయా కళారూపాలను పునరుజ్జీవం గావించడానికి ప్రభుత్వాలు, వివిధ కళాసంస్థలు ఒక వైపు తమ వంతు కృషిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.
ప్రభుత్వం చేస్తున్న కృషి :
మన తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పది సంవత్సరాలుగా కళలు, కళాకారుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేస్తూ, మరుగున పడిన జానపద ప్రాచీన కళాసంపదను, గిరిజన కళాసంపదను వెలికితీసి, వారికి పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సముచిత స్థానాన్ని కల్పించే ప్రయత్నంలో భాగంగా, వివిధ శిక్షణా కార్యక్రమాలు (వర్క్‌షాప్‌) కార్యశాలలు నిర్వహించి, యువ కళాకారులను ప్రోత్సహిస్తుంది.
ఉగాది, రాష్ట్ర అవతరణ దినోత్సవం, 15వ ఆగస్టు వంటి ప్రత్యేక పండుగ సమయాల్లో పండితులతో సమానంగా వివిధ కళలలో నిష్ణాతులైన పెద్దలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తున్నారు. అంతరించి పోవుచున్న ఆయా కళారూపాలను డాక్యుమెంటేషన్‌, ఇంటర్వ్యూల ద్వారా సేకరించి భద్రపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్‌లు, మెండుగా పెంపొందింపజేయుట ఆయా ప్రభుత్వాల కళాతృష్ణకు సజీవ సాక్ష్యమే అవుతుంది. మరుగున పడిన కళాకారులను ఢిల్లీ పీఠానికి పరిచయం చేసి, వారికి ‘పద్మశ్రీ’ అవార్డు వరించునట్లు చేసిన ఘనత కూడా వారికే దక్కుతుంది అనుటలో అతిశయోక్తి లేదు. తెలంగాణ కళాకారులను దేశంలోని నలుమూలలా జరిగే వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలలోనూ పాల్గొనేలా అవకాశం ఇప్పించుట, వారికి నిర్దిష్టమైన గుర్తింపు కార్డులు ఇప్పించి, కళారంగ కీర్తి పతాకాన్ని జాతీయ జెండాతో పాటు ఎగురవేసిన ఘనత కూడా వారికే దక్కుతుంది. ప్రాచీన కళారూపాల పున:వైభవానికై వీరు చేసిన సేవ ఒక యజ్ఞమే అవుతుంది. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి కళాకారుడికీ ‘కళాకారుల దినోత్సవం’ ప్రతి రోజూ జరగాలి.
ముగింపు :
కళలు, కళాకారులు మనుగడ సాగిస్తేనే మన సంస్కృతి ముందుతరాలకు కూడా విస్తరిస్తుంది. కావున ఆయా వృత్తి కళాకారులను ఆదరించే ప్రయత్నం ప్రభుత్వం ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. ఆయా దాతృత్వ కులాల పెద్దలు బాధ్యతగా వారి వారి ఆశ్రిత కులాల కళాకారులను చేరదీసి కనీసం నెలకొక్కసారి ఊరికొక్క ప్రదర్శనకు అవకాశం కల్పించినా, కళారూపాలు గుర్తింప బడతాయి. రేపటి తరానికి అందించబడతాయి. తద్వారా గ్రామీణ కళలు వర్ధిల్లుతాయి. దాతృత్వ కులాల పెద్దమనుషులు వారు సంపాదించిన ఆస్తికి పన్నురూపంలో కట్టే మొత్తంలో కొంత భాగాన్ని ఆశ్రిత కులాల కళాప్రదర్శనకు మినహాయిస్తే… కళాకారుల దారిద్య్రాన్ని పారద్రోలి, ప్రాచీన కళా వైభవానికై ప్రభుత్వాలు పూనుకుంటే తిరుగులేకుండా ఉంటుంది.
– ప్రతి సెలవు దినాలలో పిల్లలకు ఏదో ఒక లలితకళను పరిచయం చేసి, వారి అభిరుచిని బట్టి సంగీతం, నృత్యం, వాద్యం, చిత్రలేఖనం వంటి కళలలో తర్ఫీదు ఇప్పించాలి.
– ఆట విడుపుగా ఆయా భారతీయ కళారీతులను, నిష్ణాతులను టి.వి., సినిమాల ద్వారా పరిచయం చేసి వారిని గురించిన ప్రశ్నలు పిల్లలను అడుగుట ద్వారా వివిధ కళల పట్ల పరిజ్ఞానం లభిస్తుంది. అవకాశం ఉన్నప్పుడు మ్యూజియంలకు కూడా తీసుకెళ్లవచ్చును.
– ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలోనూ ఐచ్ఛికాంశంగా జానపద కళలనూ ‘కళావిద్య’లో భాగంగా చేర్చుట ద్వారా బాల్యదశ నుండే పిల్లలకు వారి వారి గ్రామీణ కళలు, అలాగే భారతీయ కళలు పరిచయం అవుతాయి.
రేపటి తరాన్ని నూతన కళాకారులుగా తయారు చేయడమే ఈ వారంలోని అక్టోబర్‌ 25 అంతర్జాతీయ కళాకారుల దినోత్సవానికి నిజమైన అర్థం అని నా భావన.
– డా|| లింగా శ్రీనివాస్‌, 9030340884
జానపద కళావిద్యా ప్రచారకులు,