కళ తప్పిన మొగల్‌ కళ

Art is missing Mughal artఔరంగజేబు కాలంలో కళల గురించి ఆలోచిస్తే మొదట కొన్ని పోట్రేటులు, చిత్రాలలో రాజుల వేటకు సంబంధించిన కొన్ని దృశ్యాలు చిత్రించినా, అంతకుముందు మొగలు ఆస్థానంలో చిత్రాలతో గ్రంథాలు రాయబడ్డ ఆ పెద్ద చిత్రాల కార్ఖానా పనులు తగ్గాయి. షాజహాన్‌ కాలంలో ఉచ్ఛస్థితిలో వున్న చిత్రాలకు ప్రతిలిపిలా అనిపించేట్టు పలుచటి రంగుల కొన్ని చిత్రాలు వేశారు. రాజు చిత్రాలపై మతపరమైన అవరోధాలు విధించి ఆస్థాన చిత్రకారులను తొలగించాడు. వారిలో కొందరు దర్బారు కార్యకర్తలను, రాణీవాసం వారిని కళల ప్రాపకం కోసం ఆశ్రయించారు. మరికొంతమంది కళాకారులు రాజస్థాన్‌, పంజాబ్‌ కొండ ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఒక గొప్ప పాలరాతి ఇమారుతం తాజ్‌మహల్‌ కట్టించిన షాజహాన్‌ ఘనమైన రాజ్యకాలం తర్వాత, మొగల్‌ సామ్రాజ్యానికి చక్రవర్తిగా సింహాసనం అధిష్టించవలసినవాడు, వారసుడు దారాషికో. అతను వేదాంతి, జ్ఞాని, కాలిగ్రఫీ కళలో ఉత్తీర్ణుడు. మొగలు సామ్రాజ్య చిత్రకళని ఎంతో ముందుకు తీసుకువెళ్లగల విజ్ఞత వున్నవాడు. కానీ అతను రాజు కాలేదు. ఆ సమయంలో మొగలు సామ్రాజ్యానికి బీటలుబారి కళ తప్పే చర్యలు మొదలైనాయి. షాజహాన్‌ మరో కొడుకు ఔరంగజేబు, తన తండ్రిని బందీ చేసి కారాగారంలో వుంచి, దారాషికోని తొలగించి క్రీ.శ. 1658లో సింహాసనం అధిష్టించాడు. క్రీ.శ. 1680లో మొగలు సామ్రాజ్యపు మరో ఇటుక మళ్లీ లాగి పునాదులు బలహీనపరిచాడు. ఈ సామ్రాజ్యం నెలకొల్పిన బాబర్‌ క్రీ.శ. 1560 నుండి తన రాజ్యంలో మత సామరస్యం నెలకొల్ప ప్రయత్నించాడు. అది ఆపై వచ్చిన రాజులూ ఆ ప్రయత్నాన్ని గట్టిపరిచారు. కానీ ఔరంగజేబు సమాజంలో తన వ్యక్తిగత సనాతన సంప్రదాయాన్ని ముందుపెట్టి సమాజంలో చీలికలు తెచ్చాడు.
Art is missing Mughal artఔరంగజేబు కాలంలో కళల గురించి ఆలోచిస్తే మొదట కొన్ని పోట్రేటులు, చిత్రాలలో రాజుల వేటకు సంబంధించిన కొన్ని దృశ్యాలు చిత్రించినా, అంతకుముందు మొగలు ఆస్థానంలో చిత్రాలతో గ్రంథాలు రాయబడ్డ ఆ పెద్ద చిత్రాల కార్ఖానా పనులు తగ్గాయి. షాజహాన్‌ కాలంలో ఉచ్ఛస్థితిలో వున్న చిత్రాలకు ప్రతిలిపిలా అనిపించేట్టు పలుచటి రంగుల కొన్ని చిత్రాలు వేయబడ్డాయి. చిత్రంపై మత పర అవరోధాలు కూడా రాజు విధించినందున ఆస్థాన చిత్రకారులను తొలగించారు. వారిలో కొందరు దర్బారు కార్యకర్తలను రాణీవాసం వారిని కళల ప్రాపకం కోసం ఆశ్రయించారు. మరికొంతమంది కళాకారులు రాజస్థాన్‌, పంజాబ్‌ కొండ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఔరంగజేబు ఖురాన్‌ ప్రతిలిపిలు రాస్తూ, మతపర చర్యలో నిమగమయ్యాడు. తన ఆఖరి దశలో ఈ విధంగా తను చేసిన కొన్ని పనుల వలన రాజ్యానికి కలిగిన నష్టానికి తరువాత పశ్చాత్తాప పడ్డాడు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం?
క్రీ.శ. 1707 వరకు ఔరంగజేబు రాజ్యం చేసి, మరణించిన పిదప మొగలు సామ్రాజ్యం మరికొన్ని ఇక్కట్లు ఎదుర్కొంది. కేంద్రీకృతమైన విశాల మొగలు సామ్రాజ్యం విచ్ఛిన్నమవడం మొదలుపెట్టింది. ఈ పరిస్థితుల్లో సామంతులు బలవంతులైనారు. చిత్రకారులు సామంతుల ఆస్థానాలు చేరడం మొదలుపెట్టారు. వీరు ఈ మొగలు కళల రీతి ఆస్థానాలకు తీసుకువెళ్లినా పూర్వ వైభవం వున్న చిత్రం మళ్లీ పదును అందుకోలేకపోయింది. అందమైన చిత్రం వేయాలనే ప్రయత్నమూ వారు వదలలేదు. ఆ తరువాత వచ్చిన రాజు మొహమ్మద్‌షా ఆస్థానంలో ఆరిపోయే దీపంలా చిత్రం ఆఖరి మెరుపులు మెరిసింది. ఆపై మరాఠా ఆక్రమణలు, దాడులు పెరిగాయి. ఆ నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు మొహమ్మద్‌ షా చిత్రం, సంగీతం, సాహిత్యం, నృత్యంలో తన మనశ్శాంతిని వెతుక్కునేవాడు. ఇతని సమయంలో రాజదర్బారులోని చిత్రాలు, ఒక శాంతి దూత చిత్రాలలాగే కనిపిస్తాయి. సాధువులు, సన్యాసుల సంఘటిత దృశ్యాల చిత్రాలు కూడా ఆ సమయంలో వేశారు.
అతని రాణివాస చిత్రాలు ఆనాటి అతని విలాస జీవితానికి అద్దం పట్టినట్టు వుండేవి. ఆనాటి చెల్లాచెదరైన రాజకీయ సాంఘిక పరిస్థితులలో రజ వంశీయులు ఈ విధంగా ఆనందం వెతుక్కున్నారనిపిస్తాయి. చిత్రలలో తెలుపు, సుతిమెత్తని రంగులు, వెండిలా మెరిపించే బూదిడ రంగు, మట్టి, నాచు రంగు, కుంకుమ, పసుపు రంగులు వాడారు ఆ సమయం చిత్రాలలో.
చక్కటి డ్రాయింగ్‌ గీతలు, వివరాలు దిద్దేవారు. మొహమ్మద్‌ షా రాజ్యం వరకు కొంతమంది కళాకారులు చితరమన్‌, గోవర్దన్‌, మొహమ్మద్‌ ఫకీరుల్లా ఖాన్‌, హోనార్‌ హల్‌, మీర్‌ కలన్‌ఖాన్‌, మొహమ్మద్‌ అఫ్జల్‌, అఖిల్‌ఖాన్‌, నిద్దమల్‌ వంటి కళాకారులు ఒక పద్ధతిగా చిత్రకళని సాగించారు.
కంచెలు పలుచబడ్డ పొలంలోకి అటుఇటు తిరిగే జీవ జంతువులు దూరి రావడం సహజం. నాదిర్‌షా అనే ఒక పర్షియన్‌, నీరసించిన మొగల్‌ సామ్రాజ్యంలోకి చొచ్చుకుని వచ్చాడు. క్రీ.శ.1739లో ఢిల్లీ, లాహోర్‌కి వచ్చి తనతో కోహినూర్‌ వజ్రాన్ని, షాజహాన్‌ మణులు పొదిగి చేయించిన నెమలి సింహాసనాన్ని, మొగల్‌ వైభవ కాలంలో చిత్రించిన చిత్ర గ్రంధాలను, అందులోనూ మొగలులు గర్వించిన హమ్జానామా గ్రంధాన్ని కూడా తనతో తీసుకుని వెళ్లాడు. కొల్లగొట్టబడిన మొగల్‌ ఆస్థానంలోని కళాకారులకు చోటేది? రాజకీయ, సాంఘిక పరిస్థితుల సంతులనం దెబ్బతిన్నప్పుడు మొదటగా గంటు పడేది కళలకే! ఆ సమయంలో కళాకారులకు ఆస్థానంలో ఆసరాలేక వారు అవధ్‌, ముర్షీదాబాద్‌ (ఈనాటి బంగ్లాదేశ్‌లో వుంది – లక్నో ప్రాంతం) వెళ్లిపోయారు. ఎక్కడ రాజుల రాజ్యం ఒడిదొడుకులు లేకుండా సాగుతుందో అక్కడ కళాకారులకూ స్థానం దొరుకుతుంది.
భారతదేశంలోని అంతర్గత కలహాల వలన, బ్రిటీష్‌వారు, ఈస్టిండియా కంపెనీ పేరు మీద భారతదేశంలోకి చొరబడడం తేలికైంది. వారు వ్యాపారం పేరు మీద వచ్చి రాజకీయస్థానం సంపాదించి స్థిరపడ్డారు. మొగల్‌ చక్రవర్తులను వారి చేతిలో కీలుబొమ్మలని చేసి, వారికి కొంత సొమ్ము అవసరార్ధం ఇచ్చి అధికారం చేజిక్కించుకున్నారు. ఆ సమయంలో వారి కన్ను భారతీయ చిత్రకళపై కూడా పడి కొన్ని చిత్రాలకు వారు ప్రతిలిపిలు చిత్రింపజేసి, ఆల్బములుగా అన్నీ దగ్గరకు చేర్చుకోమొదలుపెట్టారు. ఆ సమయంలో రెండవ షా ఆలమ్‌ మొగలు రాజు వద్ద వున్న చిత్రకారుల నిపుణత తగ్గి అలంకారప్రాయంగా మటుకే చిత్రాలు వెలువడ్డాయి. అతి సరళమైన ప్రకృతి దృశ్యాలు, చెక్క వంటి ముఖాలతో స్త్రీలు, పాలిపోయిన రంగుల చిత్రాలు వెలువడ్డాయి. అక్బరు, జహంగీర్‌, షాజహాన్‌ కాలం నాటి చిత్రాలకు పేలవమైన ప్రతిలిపిలు చిత్రించి, వాటిపై ఆ చిత్రకారుల సంతకమూ వీరే రాసి కళా ప్రేమికులను తప్పుదోవ పట్టించారు. బ్రిటీష్‌ వుద్యోగులు వారికి కావలసిన దర్బారు దృశ్యాలు, నాట్యకర్తెల చిత్తరువులను, ఇక్కడి ప్రకృతి దృశ్యాలను వారి కళాకారులచే చిత్రించుకుని, వారి ఆల్బమ్‌లు తయారు చేసుకున్నారు. క్రీ.శ. 1857లో జరిగిన బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటుకు రెండవ బహదూర్‌షా కారణమని, అతన్ని బ్రిటీష్‌ వారు రంగూన్‌ కారాగారంలో బంధించారు. అతనే ఆఖరి మొగలు. అతను ‘జఫర్‌’ అనే కవితలు కారాగారంలో కూర్చొని రాశాడు.
ప్రాంతీయ ఆస్థానాలు – అవధ్‌ : ఫైజాబాద్‌, లక్నోను అవధ్‌ ప్రాంతాలుగా గుర్తించారు. మొగల్‌ ఆస్థాన కళలు విచ్చిన్నమైన తరువాత ఈ అవధ్‌లో చిత్రకళ ఒక వెలుగు సంతరించుకుందని చెప్పవచ్చు. మొగలు ఆస్థాన చిత్రకారులు వలసపోయి, కొంతమంది ఈ రాజ్యం చేరారు. క్రీ.శ. 1750 తరువాత వలస పోయిన వీరు తమతోపాటు పూర్వపు రేఖాచిత్రాలు, అచ్చు కాగితాలు తీసుకువచ్చారు. వాటి ఆధారంగా చక్కటి అందమైన చిత్రాలు, వాటికి అలంకారాలు దిద్దారు. క్రీ.శ. 1760 – 1800 మధ్య వారు చిత్రించిన అవధ్‌లోని చిత్రాలు మొగలు చిత్రకళ నుండి వలస వచ్చిన చిత్రాలని అర్ధమవుతుంది. క్రీ.శ. 1772 లో రాసిన ఒక ఉత్తరం ద్వారా ఢిల్లీ కళకారులు ఈ విధంగా లక్నోకి, మిగిలిన ప్రదేశాలకూ వలస పోయారని తెలుస్తుంది.
ఆ ఉత్తరం మొగల్‌ ఆస్థానంలో పనిచేస్తున్న ఒక మరాఠా ఉద్యోగి, మరాఠా రాజ్యంలో ముఖ్యుడు అయిన పేష్వా నానా ఫడనవీన్‌కి రాసిన జాబు అది. ఆ ఉత్తరం ప్రకారం క్రీ.శ. 1757లో అబ్దాలి ఆక్రమణ తరువాత, నిద్దమల్‌ అనే చిత్రకారుడు లక్నోకి వలసపోయి అక్కడే మరణించాడు. అతని ఇద్దరు కొడుకులు లక్నోలో వున్నారు. ఒకడు ఏమీ చేతకానివాడు. రెండవవాడు కొద్ది చిత్రకళ నేర్చినవాడు. మంచి కళాకారులు చాలామంది వలసపోయారు. వారసులు మంచి పని నేర్చుకోలేకపోయారు. ఢిల్లీ ఇప్పుడు ఇదివరకటి వైభవంలో లేదు… ఇలా ఈ ఉత్తరం ద్వారా ఆనాటి చిత్రకళ పరిస్థితి అర్ధం అవుతుంది.
అవధ్‌లో క్రీ.శ. 1754 నుండి 1775 వరకు పాలించిన ఘజాఉద్‌దుల్లా, క్రీ.శ.1775 నుండి 1797 వరకు పాలించిన అసఫ్‌ఉద్‌ దుల్లా యొక్క రాజ్యవైభవం కొంత వుండేది. రేవు నిండితే కప్పలు చేరతాయన్నట్టు, ఈ ఆస్థానం సాహిత్యకారులనీ, చిత్రకారులనీ ఆకర్షించింది. ఆ సమయంలో బ్రిటీష్‌వారు ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరుమీద తూర్పు రాష్ట్రాలు చేరారు. వారితో బాటు బ్రిటీష్‌ కళకారులనీ తెచ్చి, ఇక్కడి ఆస్థానాల్లో ప్రవేశపెట్టారు. జాన్‌ జోఫనీ క్రీ.శ. 1771 – 72 మధ్య టిల్లీకెటల్‌ క్రీ.శ. 1783 – 89 మధ్య అవధ్‌ ఆస్థాన చిత్రకారులుగా వున్నారు. వీరు వేసే తైల చిత్రాల పద్ధతి అవధ్‌ చిత్రకారులని ఆకర్షించింది. వారూ అటువంటి పద్ధతీ, శైలీ నేర్చి, ఆస్థాన చిత్రాలలో కలగలుపు పద్ధతి తీసుకువచ్చారు. ఈ సమయంలో ఇలా మిశ్రమ పద్ధతి తీసుకువచ్చిన వారిలో మిహిర్‌చంద్‌, మీర్‌ కలన్‌ ఖాన్‌, నిద్దమల్‌, నేవాసిలాల్‌, ఫైజుల్లాఖాన్‌, బహదూర్‌సింగ్‌, గులామ్‌ రెజా వున్నారు.
కలాన్‌ ఖాన్‌ చిత్రాలు యూరోపియన్‌, పర్షియన్‌, మొగల్‌, దక్కని పద్ధతుల మిశ్రమంలా కనిపిస్తాయి. ఫైజుల్లాఖాన్‌ చిత్రాలలో ఒక అద్భుత ప్రపంచం కనిపిస్తుంది. ఎన్నో అంతస్తుల మేడలు, పూలతో నిండిన పచ్చిక బీడులు, వర్షం తరువాత బంగారు వన్నెతో నిండిన ఆకాశంలోని మబ్బులు, ఉద్యాన వనాలతో నిండిన అందమైన దృశ్యాల చిత్రాలవి.
ముర్షీదాబాద్‌ : వలసపోయిన కళాకారులు చేరిన మరో ఆస్థానం ముర్షీదాబాద్‌. ఇది బెంగాల్‌ ప్రదేశ్‌ ముఖ్యకార్య కేంద్రం. వ్యాపార కేంద్రం. ఇక్కడి పట్టు, మస్లీన్‌ నూలు ఎంతో ప్రసిద్ధి. నవాబ్‌ అలివర్దీఖాన్‌ క్రీ.శ. 1740 – 56 వరకు పాలించిన సమయంలోని చిత్రాలు ముఖ్యమైనవి. క్రీ.శ. 1757 నుండి బ్రిటీష్‌ ఇక్కడి తమ అడుగు నిలిపినా, వారు అక్కడి ప్రాంతీయ కళని ఆచారాన్ని ఆ సమయంలో చెదరగొట్టలేదు. అలివర్దీఖాన్‌ ఆస్థానంలో ఆస్థాన చిత్రాలు, వేటాడే చిత్రాలు, రాగమాల చిత్రాలు వెలికి వచ్చాయి. భారతీయ సంగీతంలోని దీపరాగం, తోడిరాగం, భైరవరాగం, హిందోళరాగం వంటి సంగీత రాగాలపై చిత్రాలు గీయడం భారతీయ సంప్రదాయ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తుంది. వలస వచ్చిన చిత్రకారులు ఇక్కడ స్థిరపడడమే కాదు, కొంతమంది చిత్రకారులు అన్నీ ఆస్థానాలకు తిరుగుతూ, ప్రయాణిస్తూ వుండేవారు. అలాంటి వారు ఈ ఆస్థానానికీ వచ్చారు. వారు ఎన్నో ఆస్థానాలు, వివిధ పద్ధతులు చూస్తూ ఉండడం వల్ల వారు వేసే చిత్రంలో ఎంతో వైవిధ్య శైలి చోటు చేసుకుంటుంది. అలాంటి వైవిధ్యం ఇక్కడా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అవధి, ముర్షీదాబాద్‌ చిత్రాలని మొగల్‌ చిత్రాల ఆఖరి దశగా గుర్తించవచ్చు. ఒకటి ఆ చిత్రకారుల పరంపర ఇక్కడ కనిపించడమే కాక, ఆ విధంగా చిత్రకళపై కొంత శ్రద్ధ ఇక్కడి ఆస్థానాల్లో కనిపిస్తుంది. చిత్రాలలో ఆభరణాలు, వస్త్రాల వివరణ కూడా చిత్రించారు. బ్రిటీష్‌వారికీ భారతీయ చిత్రకళపై మోజు పెరిగింది. క్రీ.శ. 1744 – 66 వరకు ఆఫీసరుగా వున్న విలియమ్‌ ఫుల్లార్టన్‌ అనే యూరోపియన్‌ను దీప్‌చంద్‌ అనే భారతీయ కళాకారుడిచే ఎన్నో చిత్రాలు వేయించుకున్నాడు.

– డా||యమ్‌.బాలామణి, 8106713356