‘అర్థ విధవలు’

'mean widows'వారి భర్తలు ఏ అగ్రరాజ్యపు చెరసాలల్లో మగ్గుతున్నారో తెలియదు, ఏ ఉగ్రవాదపు శిబిరాల్లో నెగ్గ జూస్తున్నారో తెలియదు, పేలిన ఏ తూటాకు మట్టి పొరల్లో కప్పేయబడ్డారో తెలియదు… కానీ కఠిన మంచు కొండలు కరిగి మట్టి పరిమళం ఎప్పటికైనా తమది కాదా అని దశాబ్దాల నిరీక్షణలో దీనులైన కాశ్మీరీ మహిళలే అర్థ విధవలుగా పరిగణింపబడుతున్నారు. భర్తల సమాచారము తెలవని స్థితిలో సమాజము అంగీకరించకా, రాజ్యము నిర్దారించకా అర్థ విధవలుగా మారిన ఇలాంటి వారెందరున్నారో కూడా లెక్కలు లేవు. ”అర్థ విధవలు” అని వినడం ఆశ్చర్యంగా ఉంది. కానీ దీనిపై క్రమం తప్పని పెద్ద పెద్ద పరిశోధనలే జరుగుతున్నవి. అట్లాంటి పరిశోధన లలో భాగమైన కాశ్మీరీ జర్నలిస్టు శాఫియా నబి నిరంతర శ్రమ ప్రతిష్టాత్మకమైన ”మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ – వరల్డ్‌ పీస్‌ యూనివర్సిటీ” వారు నిర్వహించే జర్నలిజం స్కూల్‌ అవార్డుకు ఎంపికైంది. అయితే వాస్తవాలు మింగుడు పడని కొందరు మితవాదులు సదరు యూని వర్సిటీపై ఒత్తిడి తెచ్చి కాశ్మీరీ జర్నలిస్టు శాఫియా నబీకి ప్రకటించబడిన అవార్డును ఆమెకు అందజేయకుండా చేశారు. ఒక జర్న లిస్టుకు ప్రకటించబడిన అవార్డును కొన్ని ప్రతిఘాత శక్తులు తమ మితవాదపోకడలతో అడ్డుకోవడం శోచనీయమే కావచ్చు కానీ సద రు జర్నలిస్టు వెలికితీసిన వాస్తవాలను జీర్ణించుకోలేక, వాటిని ప్రపం చానికి చేరనీయకుండా చేయడం మరింత కలవరపెట్టే అంశం. ఇలాంటి దుందుడుకు వైఖరిని వాస్తవాలను బయటికి తెచ్చే జర్న లిస్టులపై దాడిగానే కాకుండా సమాజ నిర్లక్ష్యానికి గురవుతున్న అభా గ్యుల జీవితాల పట్ల బాధ్యతాలేమిని తెలియజేస్తోంది.
శాఫియా నబి ప్రచురించిన కథనం ఏమిటి?
స్క్రోల్‌ పోర్టల్‌ ద్వారా శాఫియా నబి కాశ్మీర్‌కు సంబంధించిన కొన్ని పరిశోధనలను ప్రస్తుతించింది. కాశ్మీర్లో నివసిస్తున్న మహిళలు అనేక కారణాల వల్ల తమ భర్తలు ఏండ్ల తరబడి ఇంటికి రాక పోవ డంతో యాజమాన్య హక్కులు ఎవ్వరికివ్వాలనే దానిపై సంది గ్ధత ఏర్పడుతున్నది. భర్తలకు దూరమైన స్త్రీలకు ఆస్తిపాస్తులపై ఎలాంటి హక్కులు సక్రమించడం లేదు. దూరమౌతున్న పురుషులు ఏమౌతు న్నట్లు? కొందరు మగవాళ్ళను ఉగ్రవాదులుగా అనుమానించి పోలీ సులు లేదా మిలిటరీ వాళ్లు తీసుకెళ్లిపోవడం, కేసు నమోదుతో సంబంధం లేకుండా విచారణల్లో ఏమౌతున్నారో తెలియట్లేదు. అధి కారులు బంధిస్తున్న ఆనవాళ్ళు కూడా దొరకడం లేదు. మరికొంద రిని ఉగ్రవాదులే చెరబట్టి, ఉగ్రవాద సంస్థల్లో బలవంతంగా చొప్పించడం, ఆ తరువాత ఇంటికి దూరమవడం జరుగుతుంది. మరికొంతమంది అనేక ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోవడం, ఆచూకీ తెలపకపోవడం వల్ల భర్తల క్షేమ సమాచారం తెలియని అనేకమంది అభాగ్యులు ఎదురుచూస్తూ ఉంటారు. దశాబ్దాలు గడిచినా ఇలాంటి మహిళలకు ఆస్తిపాస్తులపై హక్కులు గాని వార సత్వ సంక్రమణలు గాని ఇవ్వడానికి ప్రభుత్వాలు, సమాజమూ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. దానితో దిక్కుతోచని విధంగా ఈ మహిళలందరూ తనువు చాలిస్తున్నారు. భర్త ఉన్నాడో లేడో తెలియకుండా చాలీ చాలని బతుకులీడుస్తున్న ఇలాంటి మహిళలం దరినీ ”హాఫ్‌ విడోలు” అర్థ విధవలుగా నబి తన కథనంలో అభివర్ణించారు.
అవార్డు రద్దు..
నబి ప్రచురించిన ”హాఫ్‌ విడోస్‌ ఆఫ్‌ కాశ్మీర్‌” అనే కథనాన్ని ఏడుగురు సభ్యులున్న ”మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ – వరల్డ్‌ పీస్‌ యూనివర్సిటీ” జ్యూరీ అవార్డుకు ఎంపికైంది. అక్టోబర్‌ 18న బహుమతి ప్రదానం జరుగనున్నదని రచయితకు పది రోజుల ముందే సమాచారమూ ఇచ్చారు. తీరా ఒకరోజు ముందు యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ నుండి ఫోన్‌ చేసి ”కొన్ని ఒత్తిళ్ళ కారణంగా బహుమతి ప్రదానం రద్దు” చేస్తున్నట్లుగా సమాచార మిచ్చారు. రద్దుకు గురిచేసిన అంశాలను పరిశీలించినప్పుడు తెలిసేదేమంటే, రచయిత మతమో లేక జరుగుతున్న అన్యాయానికి గురైన మహిళల మతమో అనుకుంటే అది కొంతవరకే కరెక్టు! పాలకుల వైఫల్యాలకు ప్రతిఫలంగా అవార్డు ఇచ్చినట్లౌతుందన్న భావనతోనే ఈ అవార్డును తిరస్కరించారనేది స్పష్టమౌతుంది. అయితే జర్నలిస్టులను వేధిం చడం భారతదేశంలో కొత్త కాదు. గత తొమ్మిది సంవత్సరాల్లో వేధిం చబడిన జర్నలిస్టుల సంఖ్య మరింత పెరుగుతుంది. 1990 నుండి 2658 విలేకర్లు హత్యగావింపబడితే ఒక్క 2022లో 67 మంది జర్నలిస్టులు హత్యజేయబడ్డారు. అందుకే 2023 సంవత్సరానికి గాను ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌లో భారత్‌ 161/180 స్థానాన్ని పొందింది. అయితే నేడు మన ముందు రెండు సవాళ్ళున్నవి. అవి ఏమంటే, ఇలాంటి అర్థ విధవలు ఈ దేశంలో పలు చోట్ల, పలు కారణాల చేత ఇంకెందరున్నారో, వారి భవిష్యత్తేమిటోనన్నది, ప్రాచుర్యానికి నోచుకోని ఇలాంటి కథనాలూ, వాటిని బహిర్గత పరుస్తున్న విలేకర్లు కూడా ఎందరున్నారో? కేవలం కాశ్మీరులోనే కాదు అనేక ప్రాంతాల్లో ప్రతి యేటా అనేకమంది అక్రమ అరెస్టులకు గురౌతున్నారు. వాటిల్లో చాలావరకు కిడ్నాపు లుగా నమోదౌతున్నవి. ‘ఉపా’ కింద అరెస్టైన ఆనంద్‌ తేల్‌తుంబ్డే, సాయిబాబా వంటి వారి కుటుంబాల పరిస్థి తులూ అంతే! చేయని నేరాలకు జైలు జీవితం గడుపుతున్న వారు, నేరం మోప బడిన వారూ జైళ్ళల్లో ఉన్న సంగతి తెలిసి నప్పటికీ వారి కుటుంబాలు అనాథలుగానే బతుకీడుస్తుంటారు. దీనిపై రాజ్యం దృష్టి లేదని చెప్పలేము అంతే కాకుండా రాజ్యం ఇలాంటి వాటిని బలపరుస్తున్న సంకేతాలు కూడా వున్నవి.
– జి.తిరుపతయ్య, 9951300016