కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ లేదా ఎ.ఐ)ను ఉపయోగించడానికి నిర్మాతలు సిద్ధపడినప్పుడు హాలీవుడ్ రచయితలు దాని కారణంగా తమ ఉపాధి దెబ్బతింటోందంటూ సమ్మెకు దిగారు. ఆ ఘర్షణ సర్దుబాటు అయింది. అయితే ఆ సమ్మె లేవనెత్తిన మౌలిక ప్రశ్న మాత్రం అలానే మన ముందుంంది. ఎ.ఐ ని ప్రవేశ పెడితే వచ్చే అనేక సమస్యల గురించి చాలా మంది రాశారు. కాని ఎ.ఐ కారణంగా తలెత్తే భారీ స్థాయి నిరుద్యోగం గురించి ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాలి.
ఇక్కడ సమస్య ఎ.ఐ ది కాదు. ఎ.ఐ ని పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రవేశ పెట్టడం వలన వచ్చే సమస్య ఇది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక భాగంలో ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్థే గనుక శ్రామిక ప్రజానీకానికి ఇది తీవ్రమైన సమస్యగా ఉంటుంది. శ్రమను అందరూ పంచుకోవడం, దాని ఫలితంగా వచ్చే ఉత్పత్తిని కూడా అందరూ పంచుకోవడం అన్న సూత్రాన్ని అనుసరించే వ్యవస్థ, అంటే సోషలిస్టు వ్యవస్థ వంటిది ఉన్న చోట ఎ.ఐ ని ప్రవేశపెడితే అది పెద్ద సమస్య కానే కాదు. ఎ.ఐని ప్రవేశ పెట్టడం వలన వచ్చే నైతిక, ఇతర అభ్యంతరాలను పక్కన పెడితే, అది సోషలిస్టు వ్యవస్థలో మనుషుల మీద పనిభారాన్ని తగ్గిస్తుందే తప్ప అక్కడ ఉపాధి అవ కాశాలను నాశనం చేయదు. కాని పెట్టుబడిదారీ వ్యవస్థలో అలా జరగదు. ఎందుకంటే ఈ వ్యవస్థ పని భారాన్ని పంచుకోవడం, ఉత్పత్తిని పంచుకోవడం అనే సూత్రాన్ని అనుసరించదు.
ఉదాహరణకు, ఎ.ఐని ప్రవేశ పెట్టడం వలన గాని, మరే ఇతర టెక్నాలజీని ప్రవేశ పెట్టడం వలన కాని ఇప్పుడు 100 మంది కార్మికులు అవసరమైన చోట 50 మంది మాత్రమే సరిపోతారనుకుందాం. ఇది సోషలిస్టు వ్యవస్థలో జరిగితే అప్పుడు ఆ 100 మంది కార్మికులమీద పనిభారం సగానికి తగ్గిపోతుంది. వారికి అంతవరకూ చెల్లించిన వేతనాలు అలానే కొనసాగుతాయి. అంటే వారి తీరుబాటు సమయం పెరుగుతుంది. అదే సమ యంలో అంత వరకూ వారు పొందిన మోతాదులోనే సరుకులను ఇక ముందూ పొందగలుగుతారు. లేదా, అంతకు ముందు ఎంత సమయం పని చేస్తూ వచ్చారో, అంత సమయమూ ఇప్పుడు కూడా (అంటే, ఎ.ఐ ని ప్రవేశ పెట్టిన తర్వాత కూడా) పనిచేస్తూ వచ్చారనుకోండి. అప్పుడు వారి వేతనాలు రెట్టింపు అవుతాయి. అంటే సోషలిజంలో ఉత్పాదకత పెరుగుతున్న కొద్దీ దాని ఫలితంగా వారి తీరుబాటు సమయం కాని, ఆదాయాలు కాని పెరుగుతూ పోతాయి. వారి శ్రమకాలం అంతకు ముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది.
అదే పెట్టుబడిదారీ వ్యవస్థలోనైతే, తక్కువ మంది కార్మికులతో పని చేయించగలిగే టెక్నాలజీని ప్రవేశ పెడితే దాని ఫలితంగా వెంటనే ఉపాధి తగ్గిపోతుంది. పైన చెప్పిన ఉదాహరణనే పెట్టుబడిదారీ వ్యవస్థకు వర్తింపజేస్తే, ఇక్కడ ఎ.ఐ ని ప్రవేశపెట్టగానే, 50 మందికి ఉద్యోగాలు పోతాయి. కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టినందుకు అయ్యే అదనపు ఖర్చు వలన తమ లాభాలు తగ్గిపోకుండా ఉండాలంటే యజమానులు అదనంగా ఉండే కార్మికులను తొలగించి తద్వారా తమ ఖర్చును తగ్గించుకుంటారు. ఇలా పనులు పోగొట్టుకున్న 50 మందీ నిరుద్యోగ సైన్యంలో కలుస్తారు. అప్పుడు మెరుగైన జీతాలు కోరుకునే కార్మికుల పోరాట శక్తి బలహీన పడు తుంది. వారి వేతనాలు పెరగవు సరికదా తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే పని భారాన్ని తగ్గించే ఏ టెక్నాలజీ అయినా పెట్టుబడిదారీ సమాజంలో ప్రవేశపెడితే దానివలన కార్మికుల పరిస్థితి మరింత దిగజారుతుంది. నిరు ద్యోగం మరింత పెరుగుతుంది. కార్మికుల నిజ వేతనాలు తగ్గుతాయి. దానికి భిన్నంగా సోషలిజంలో అదే టెక్నాలజీ వలన కార్మికుల చాకిరీ భారం తగ్గుతుంది. మానవులకు మరింత సుఖ సంతోషాలు కలుగుతాయి. అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎ.ఐ ప్రవేశం వలన కార్మికుల జీవితాలు నాశనం అవుతాయి.
ఇదేదో 19వ శతాబ్దం నాటి మొరటు కార్మిక పోరాటపు వాదనగా ముందు అనిపించవచ్చు. 19వ శతాబ్దంలో జౌళి పరిశ్రమల్లో యంత్రాలను ప్రవేశ పెట్టినప్పుడు దాని కారణంగా తమ ఉద్యోగాలు పోతాయని ఆ యంత్రాలను ధ్వంసం చేయడానికి కార్మికులు పూనుకున్నారు. ఆ ఉద్యమకారులను ”లుడ్డైట్స్” అంటారు. వారి వాదన అంతా యంత్రాల ప్రవేశం వలన తమ ఉద్యోగాలు పోతున్నాయనే. ఆ వాదనలో పొరపాటు ఏమిటి? యంత్రాల ప్రవేశంతో వారి ఉద్యోగాలు పోయిన మాట వాస్తవమే కదా?అయితే వారి ఉద్యోగాలు పోయినది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆ యంత్రాలను ప్రవేశపెట్టడం వలన తప్ప యంత్రాల వలన కాదు. పెట్టుబడిదారీ సమాజపు లోపాన్ని వారు టెక్నాలజీ లోపంగా చూశారు. అంతే తప్ప ఉద్యోగాలు కోల్పోరాదన్న వారి వాదనలో తప్పేమీ లేదు. నిజానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో కొత్త టెక్నాలజీ వస్తే అదనపు ఉద్యోగాలు వస్తాయని వాదించేవారిదే తప్పుడు వాదన.
అలా కొత్త టెక్నాలజీ ద్వారా అదనపు ఉద్యోగాలు కలుగుతాయని వాదించిన ఆర్థికవేత్తలలో డేవిడ్ రికార్డో ముఖ్యుడు. వేతనాలు ఎప్పుడూ స్థిరంగా, జీవించేందుకు సరిపోయేలా ఉంటాయని భావిస్తూ, అటువంటి స్థితిలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెడితే కొందరి ఉద్యోగాలు వెంటనే పోతాయని, అయితే పెట్టుబడిదారుల లాభాలు బాగా పెరుగుతాయని, అలా పెరిగిన లాభాలను పెట్టుబడిదారులు మళ్ళీ పెట్టుబడి రూపంలో పెడ తారని, అప్పుడు చాలా కొత్త ఉద్యోగాలు వస్తాయని, అలా వచ్చే కొత్త ఉద్యోగాలు అంతకు ముందు కోల్పోయిన ఉద్యోగాలకన్నా ఎక్కువ సంఖ్యలో ఉంటాయని రికార్డో వాదించాడు. ఆ విధంగా కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం వలన ఉత్పత్తి రేటు, ఉపాధి రెండూ పెరుగుతాయిని అతడు భావించాడు. అంటే కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టిన ఫలితంగా ఏర్పడే నిరుద్యోగం తాత్కాలికమేనని, ఆ తర్వాత వచ్చే కొత్త ఉపాధి అవకాశాలు అంతకన్నా చాలా ఎక్కువగా ఉంటాయని రికార్డో అభిప్రాయపడ్డాడు.
ఈ రోజుకీ యజమానులు, ప్రభుత్వాలు ఇదే వాదనను ఉపయోగిస్తున్నాయి. కార్మిక సంఘాలు తమ ఉపాధి అవకాశాలను దెబ్బతీసే కొత్త టెక్నాలజీని వ్యతిరేకించిన ప్రతీసారీ ఇదే వాదనతో యజమానులు కార్మికుల డిమాండ్లను తిరస్కరిస్తున్నారు. రికార్డో వాదన అంతా కొత్త టెక్నాలజీ కేవలం ఒక్కసారి మాత్రమే ప్రవేశ పెడతారన్నట్టు, దాని వలన కలిగే తాత్కాలిక నిరుద్యోగం కొంతకాలంలో సర్దుకుపోయి అదనపు ఉద్యోగాలు కూడా వస్తాయన్నట్టు ఉంది. కాని కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం అనేది మానవ సమాజంలో నిరంతరం కొనసాగే ప్రక్రియ. దాని వలన ప్రతీ సందర్భంలోనూ ఉద్యోగాలు కోల్పోవడం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో జరుగుతూనే వుంటుంది. అందుచేత ఏ సమయంలో చూసుకున్నా కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టేముందు ఉన్న ఉద్యోగాల కన్నా, ఆ ప్రవేశం తర్వాత ఉండే ఉద్యోగాలు ఎప్పుడూ తక్కువే.
అంతకన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది. పెట్టుబడిదారుడు తాను ఉత్పత్తి చేసే సరుకులకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది అన్నప్పుడే అదనంగా పెట్టుబడి పెడతాడు. కొత్త టెక్నాలజీని తెచ్చి దాని వలన తన ఉత్పత్తి ఖర్చు తగ్గిపోయింది గనుక, లాభాలు పెరుగుతాయి గనుక అదనంగా పెట్టుబడి పెట్టాలని అనుకోడు. అలా అదనంగా పెట్టే పెట్టుబడితో ఉత్పత్తి అయ్యే అదనపు సరుకును కొనుగోలు చేయగలిగిన అదనపు డిమాండ్ మార్కెట్‌లో ఉన్నప్పుడే ఆ అదనపు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తాడు.
కొత్త టెక్నాలజీ ప్రవేశిస్తే వెంటనే ఉన్న ఉద్యోగాలు తగ్గుతాయన్నది రికార్డో సైతం అంగీకరించిన విషయం. జీతాలు ఎప్పుడూ బతకడానికి సరిపోయే స్థాయిలోనే కొనసాగుతాయన్నది కూడా అతడు చెప్పినదే. కొత్త టెక్నాలజీ వచ్చిన ఫలితంగా ఉద్యోగాలు తగ్గినప్పుడు మార్కెట్‌లో ఉండే కొనుగోలుశక్తి ఆ మేరకు తగ్గుతుంది. తక్కువ మంది కార్మికులతో పని చేయించుకున్నందు వలన పెట్టుబడిదారుల లాభాలు పెరుగు తాయి. అలా అదనంగా వారికి వచ్చే లాభాలను వారు దాచుకుంటారు తప్ప వారి వినిమయం ఏమీ పెరగదు. పైగా కొత్త టెక్నాలజీ ప్రవేశం ఫలితంగా ఉద్యోగాలు తగ్గిపోయాయి గనుక మార్కెట్‌లో ఉండే డిమాండ్ తగ్గుతుంది. దానికి తగినట్టు పెట్టుబడిదారులు ఉత్పత్తిని తగ్గించుకుంటారు తప్ప పెంచరు. అందుచేత రికార్డో ఊహించినట్టు అదనపు పెట్టుబడీ రాదు, అదనపు ఉపాధీ రాదు.
కొత్త టెక్నాలజీ ప్రవేశంతో కార్మికుల ఉద్యోగాలు తగ్గిపోతాయన్న కార్మికుల పాత కాలపు వాదన ఇప్పటికీ చెల్లుతుంది. అయితే మరి యూరప్‌లో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టినప్పుడు ఉపాధి అవకాశాలు ఎందుకు ప్రతీసారీ పెరుగుతూ వచ్చాయి? మొదటి కారణం: యూరప్ ఖండం నుంచి భారీ స్థాయిలో తెల్లవాళ్లు ఉష్ణ మండల ప్రాంతాలకు వలసలు పోయారు. అక్కడి స్థానికులను వారి వారి భూముల నుండి వెళ్లగొట్టి ఆక్రమించుకున్నారు. అందుచేత యూరప్‌లో కార్మికులకు డిమాండ్ ఎప్పుడూ ఉంటూ వచ్చింది. దాని ఫలితంగా అక్కడ కార్మికులు తమ జీతాలను పెంచుకోగలిగారు. 19వ శతాబ్దంలో ఐదు కోట్ల మంది ప్రజలు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాలకు వలస వెళ్లారు.
రెండవది: కొత్త టెక్నాలజీతో యూరప్‌లో ఉత్పత్తి అయిన సరుకులను ఇంకా పెట్టుబడిదారీ దశ పెరగని వెనుకబడిన వలస దేశాలలోకి దింపి అక్కడి మార్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అదనపు మార్కెట్ వలన యూరప్‌లో అదనపు ఉద్యోగాలు వచ్చాయి. కాని అంతకు మించిన సంఖ్యలో భారతదేశం, చైనా తదితర వలస దేశాల్లో చేతివృత్తుల మీద జీవించే ప్రజలు ఉపాధి కోల్పోయారు. ఒక విధంగా, యూరప్ తన దేశంలోని నిరుద్యో గాన్ని తాను ఆక్రమించుకున్న దేశాల మీదకు నెట్టివేసింది. ఆ దేశాల్లో పరిశ్రమలు నాశనం అయ్యాయి.
సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టినప్పుడు కలిగే నిరుద్యోగ సమస్యను ఆ విధంగా ఇతర దేశాల మీదకు నెట్టివేసి తమ తమ పెట్టుబడిదారీ వ్యవస్థలను వారు భద్రంగా కాపాడు కోగలిగారు. ఆ వలసలు విముక్తి పొంది స్వతంత్ర దేశాలుగా మారిన తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థలో కీన్స్ విధానాలను అనుసరించారు. ప్రభుత్వ వ్యయాన్ని పెంచి దాని ద్వారా అదనపు ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నం చేశారు. కాని నయా ఉదారవాద విధానాలు చేపట్టాక ప్రభుత్వ వ్యయాన్ని పెంచి ఉద్యోగాలను కల్పించడం అనేదానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆ సంపన్న పెట్టుబడిదారీ దేశాలతో సహా పెట్టుబడిదారీ ప్రపంచం మొత్తం మీద నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఎ.ఐ ని ప్రవేశపెడితే ఉద్యోగులకు, కార్మికులకు అది పెనుముప్పు కాగలదు. ఈ ముప్పును నివారించడానికి సము చితమైన రీతిలో డిమాండ్లను రూపొందించుకుని కార్మికవర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం కావాలి.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్