ప్రజాకవి, మార్క్సిస్టు పరిశోధక భావుకుడు ఆరుద్ర

Arudra is a popular poet, Marxist researcher and thinkerఆరుద్రతో పోల్చదగిన బహుముఖ ప్రతిభావంతులు చాలా చాలా అరుదుగా వుంటారు. కవి రచయిత, సినిమారంగ ప్రముఖుడు, కాలమిస్టు, చరిత్ర సాహిత్య పరిశోధకుడు, నత్య కళాశాలలో బోధకుడు, చదరంగంలో ఇంద్రజాలంలో పుస్తకాలు రాసేంత ప్రజ్ఞాశాలి, నలుగైదు భాషలు తెలిసిన వారు, అభ్యుదయ సాహిత్యోద్యమ నాయకుడు ఈ జాబితాలకు అంతులేదు. అయితే వీటన్నిటికీ ఆధారభూతంగా ఆయన పెట్టుకున్న ప్రామాణిక నిర్దేశం మార్క్సిజమే. సమగ్రమైన ఆ శాస్త్రీయ దక్పథమే ఆయన ప్రతిభకు ప్రత్యేకత సంతరించిపెట్టింది.
విశాఖపట్నంలో 1925 ఆగష్టు 31న పుట్టిన ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అని అందరికీ తెలుసు. అనేక కలం పేర్లను వాడుతూ చివరకు ఆరుద్రగా స్థిరపడ్డారు. ప్రపంచ సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆయన విద్యార్హత ఎస్సెస్సెల్సీనే. అసలు చదువంతా పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ గాక గ్రంథాలయాల్లోనే జరిగిందని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. తండ్రి నరసింగరావు సాహిత్యాభిలాషి కావడంతో కనిపించిన పుస్తకమల్లా తెచ్చేవాడు. వాటిని కుర్ర ఆరుద్ర ఎప్పటికప్పుడు చదువుతుండేవాడు. మేనమామ మహాకవి శ్రీశ్రీ అప్పటికే విశాఖ రీడింగు రూములో పుస్తకాలన్నీ తాను చదివేసి ఆరుద్రతోనూ చదివించాడు. ఆ విధంగా 13 ఏళ్ల వయసులోనే ఆరుద్ర కవిత్వ రచన మొదలెట్టారు. కొడవటిగంటి కుటుంబరావు ఆయనలో సాహిత్య ప్రతిభకు పదును పెట్టారు. చాగంటి సోమయాజులు మార్క్సిజాన్ని మేధోగతం చేసుకోవడానికి ఉత్ప్రేరకంగా పనిచేశారు. 1942లో సెట్టి ఈశ్వరరావు సిఫార్సుపై ఆరుద్ర కమ్యూనిస్టుపార్టీ సభ్యత్వం స్వీకరించి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తిండి కొరతను నివారించేందుకు దొంగనిల్వలు వెలికి తీసేందుకు ఉద్యమించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ రష్యాపై దాడి చేశాక అందుకు వ్యతిరేకంగా తన వంతు పాత్ర నిర్వహించేందుకై ఆరుద్ర వైమానిక దళంలో చేరారు. ఆనందవాణి పత్రికలో కొలువుతో సహా అనేక మజిలీల తర్వాత మద్రాసులో స్థిరపడి సజన, పరిశోధన సాగించారు. 1955 ఏప్రిల్‌లో దర్శక దిగ్గజం హెచ్‌.ఎం.రెడ్డి, శ్రీశ్రీలే సాక్షులుగా అరవై రూపాయల ఖర్చుతో జర్నలిస్టు రామలక్ష్మిని రిజిస్టరు వివాహం చేసుకున్నారు. ఆమె కమ్యూనిస్టు కాకున్నా దంపతులిద్దరూ హేతువాద భావాలనే కొనసాగించారు.
ఆది నుంచి అభ్యుదయ ప్రస్థానం
భావ కవిత్వంతోనో సంప్రదాయ వాదంతోనో బయలుదేరిన కొందరిలా గాక ఆరుద్ర అభ్యుదయ కవిగానే ప్రస్థానం ప్రారంభించారు. కవిత్వంలో టెక్నిక్కు ప్రయోగాలకూ ఆధునికతకూ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. శ్రీశ్రీ మార్క్సిజాన్ని ‘పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను’ అంటూ కవితాత్మకంగా చెబితే ఆరుద్ర ‘పైథాగరస్‌ తీరం చేరుస్తుంది’ అంటూ ఎసి స్క్వయర్‌ బిసి స్క్వయర్‌ భాషలో మలచడానికి ప్రయత్నించారు. గాయాలూ గేయాలూ, సాహిత్యోపనిషత్‌, (ఛందస్సు లేని) ఇంటింటి పద్యాలు, కూనలమ్మ పదాలు, సినీ వాలి, పైలా పచ్చీసు, అమెరికా ఇంటింటి పజ్యాలు తదితర రచనలను పరిచయం చేశారు. నాట్యశాస్త్రంలోని హస్త ముద్ర లక్షణ పదాలు మరో ప్రత్యేక రచన. ఆరుద్ర అరబ్బీ మురబ్బాలు ఆయన మరణానంతరం వెలువడ్డాయి. జీవితపు చివరి దశలో మొదలు పెట్టిన మనిషీ-ఆడమనిషి కావ్యంలోని ఒక భాగం ‘స్త్రీ పురాణం’ మహిళా కోణాన్ని ఆవిష్కరించింది. తను రాయని సినీవాలి అనే కావ్యం రాసినట్టు ఎవరో పొరబాటున పేర్కొంటే దాన్ని నిజం చేయడానికి ఆ కావ్యం రాశారు (సినీ వాలి అంటే అమావాస్యనాడు కనిపించీ కనిపించని చంద్రరేఖ.). ఇంటింటి పజ్యాలు, కేరా శతకము వంటివి కూడా అలవోకగా చేసిన ప్రయోగాలే, కూనలమ్మ పదాలు వందల మందిని కవులను చేశాయంటారు. ఆరుద్ర రాసిన కవిత్వంలో వచన కవిత్వం పాలే ఎక్కువ. అనువాద కావ్యాలు. దశ్య కావ్యాలను అనేకం అందించారు.. కథా సాహిత్యంతో పాటు కథా రచన టెక్నిక్‌ల పైనా చక్కగా రాశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంపై హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ గీతాలను తెలుగులోకి అనువదించగా సుందరయ్య గారి పుస్తకంలో ప్రచురించారు.
కొండగాలి తిరిగింది
సినిమా కవిగానూ ఆరుద్ర జనరంజక గీతాలు అనేకం రాశారు. కొండగాలి తిరిగింది పేరిట వచ్చిన సినిమా పాటలు ఆయన పట్టును చెబుతాయి. రాజులు ఎక్కు అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా అంటే. రోజులు మారి రాజులు పోయిరి.. ప్రజలే ప్రభువులు ఈనాడు..మనుషులు పైన సవారి కన్నా ఏనుగు సవారి నయం కదా అంటూ రాస్తారు. ఎదగడానికెందుకురా తొందర పాటలో నిరుద్యోగాన్ని వివరిస్తారు. గాంధి పుట్టిన దేశమా ఇది అంటూ ప్రశ్నిస్తారు. చరిత్ర రచనలోనే గాక, వేదంలా ప్రవహించే గోదావరి, మహాబలిపురం వంటి పాటలు వింటే రాగం చరిత్ర అల్లుకు పోవడం చూస్తాం. కొట్టుకుని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగమొకడు నిలిచెను చాలు అన్న ఆయన మాటలు సుభాషితాల్లా నిలిచిపోయాయి. రగిలింది విప్లవాగ్ని ఈ రోజు అంటూ అల్లూరి సీతారామరాజుకు రాసిన పాట కూడా గొప్పగా వుంటుంది సినిమా పాటల తీరు మారి విలువలు తగ్గిపోతున్న దష్ట్యా వాటిని రాయడం విరమించుకున్నారు. 150 చిత్రాలకు మాటలూ, 500 చిత్రాల్లో నాలుగు వేలకు పైగా పాటలు రాశారు.
మహా పరిశోధకుడు
మార్క్సిస్టు దక్పథంతో పరిశోధన, అధ్యయనం చేసిన ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం అందుకు తలమానికమైంది. సామాన్యుడికి సాహిత్య చరిత్ర తెలియడానికి తాను ఈ మహా భారం వేసుకున్నానని వినయంగా చెబుతూ వచ్చిన ఆయన వాస్తవంలో పండితులకు కూడా గొప్ప వనరు సమకూర్చారు. దాన్ని రాసే సమయంలో తీరిక లేకపోవడం వల్లనే గడ్డం చేసుకోవడం మానేసి పెంచేశానని సరదాగా చెబుతుండేవారు. వేమన వేదం (1974), మన వేమన, వ్యాస పీఠం, గురజాడ గురు పీఠం, సంపుటాలు ప్రజాశక్తిలో వారం వారం రాసిన వ్యాసాలతో వెలువడిన ప్రజా కళలూ-ప్రగతివాదులూ ఆయన ప్రజ్ఞకు ప్రతిబింబాలుగా నిలిచివున్నాయి. ‘రాముడికి సీత ఏమవుతుంది?’, ‘గుడిలో సెక్స్‌’ అన్న గ్రంథాలు ఆరుద్ర పరిశోధనా పటిమకూ నిదర్శనాలు. కళలు, క్రీడలు, ఇంద్రజాలం వంటి అంశాలపై కూడా సాధికార గ్రంథాలు వెలువరించారు. నాట్య శాస్త్రంలో గొప్ప అవగాహన గల ఆయన చెన్నైలో ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉపన్యాసకుడుగా వున్నారు. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలలోనూ ఆయన ప్రసంగాలు చేయగా ఆయనపై అరడజను పైగా పరిశోధనలు జరగడం మరో విశేషం.
శ్రీశ్రీ, ఆరుద్ర
రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని ఓడించాలంటూ సైన్యంలో చేరడంతో మొదలైన ఆరుద్ర రాజకీయ అవగాహన ఆఖరుదాకా అదే బాటలో సాగింది. సైద్ధాంతిక విభేదాలు పెరిగినపుడు మామూలు కవులుగా అందుకోవడంలో తాము పొరబడి వుండొచ్చని నిస్సంకోచంగా, వినయంగా చాలాసార్లు చెప్పారాయన. 1955లో ప్రగతిశీల శిబిరంలో ప్రగతి నిరోధక స్వరాలు వినిపించినపుడు ఆయనను కూడా అటువైపు చేర్చారు గాని నిజం కాదని చాలా సార్లు సోదాహరణంగా చెప్పడానికి ప్రయత్నించాడాయన. శ్రీశ్రీ కన్నా 14 ఏళ్లు చిన్నవాడయినా అవగాహన పెంచుకుంటూ సమకాలీన బందంతోనే నడవడం ఆయన ప్రతిభకూ పట్టుదలకూ అద్దం పడుతుంది. అతి సన్నిహితులైన వారి మధ్య తేడాలను రాజకీయం చేయవలసిన అగత్యమే లేదు. శ్రీశ్రీ, ఆరుద్రలు అభ్యుదయ లోకంలో గొప్ప ప్రభావం చూపిన ఇద్దరు ఉద్దండులుగా ఎప్పటికీ మిగిలి వుంటారు. ఈ వ్యాస రచయిత శ్రీశ్రీ ‘అనంతం’పైన సమీక్ష రాశాక ఆరుద్ర అభినందనలు రాస్తూ ‘ప్రముఖ సామ్యవాద కవిగా మాత్రమే ఆయనను మనం గుర్తుంచుకోవాలి’ అని ఆరుద్ర తేల్చి చెప్పారు. ఈ కారణంగానే నా శ్రీశ్రీ జయభేరి ఆరుద్రకే అంకితమిచ్చాను.
అరవైల తర్వాత ఇంకో అరుణారుణంగా
1985లో ఆరుద్ర షష్టి పూర్తి తెలుగు సాహిత్య లోకంలో ఒక పండుగలా జరిగింది. అనేక పట్టణాల్లో ఆయనను సత్కరించారు. ప్రచురణ సంస్థలు తలా ఒక సంపుటం వెలువరించాయి. మద్రాసు రాణీ శీతల్‌ హాలులో జరిగిన ఆ సభ ఇప్పటికీ గుర్తుంది. ప్రజాకళలు ప్రగతివాదులు కాపీలు తీసుకుని వెళ్లాను. ఆ తర్వాత కాలంలో ఆరుద్ర ఉద్యమానికి మరింత దగ్గరయ్యారు. కీలకమైన పలు సభలకూ సందర్భాలకూ హాజరవుతూ వచ్చారు. సుందరయ్య కన్ను మూసినపుడు రాత్రి ఫోన్‌ చేసి మరీ చిన్న కవిత చెప్పి నివాళులర్పించారు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాల మలి ముద్రణ కూడా ఆరుద్ర అప్పగించడం, అందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రజాశక్తి చేయడం యాదచ్ఛికం కాదు. బొమ్మారెడ్డిగారు, గోళ్ల రాధాకష్ణమూర్తి గారు ఆయనతో ఎక్కువగా మాట్లాడుతుండేవారు. మేడిపల్లి రవికుమార్‌ ఆరుద్రకు రాసిపెట్టడంలో సహకరించేవారు. తర్వాత కాలంలో ఆయన సాహిత్య అకాడమీ కోసం ఆరుద్ర జీవితం రాశారు.
అంతర్జాతీయంగా సోవియట్‌ విచ్ఛిన్నం, ప్రపంచీకరణ, దేశంలో అయోధ్య వివాదం తర్వాత మతతత్వ రాజకీయాలు పెరుగుతున్న తరుణంలో ఆరుద్ర మరింత పట్టుదలగానూ అధ్యయన శీలంగానూ గడిపారు. మనీ ప్రపంచం మనీ ప్రపంచం/ మనీ ప్రపంచం గెలిచిందా? మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం మారిందా?/ పీడిత శక్తుల స్వప్నాలన్నీ/పీడ కలలుగా మారాయా?/మరో ప్రపంచం మరో ప్రపంచం/ మాతామహులను మరిచేరా? /మతిభ్రమించిన అతిరథులంతా / గతితర్కాన్నే తిడతారా?/ కారల్‌ మార్క్స్‌ ఉపదేశాలకు కాలదోషమని అంటారా? /డెబ్బయ్యేళ్ల త్యాగాలన్నీ / ఇబ్బందుల పద్దుకు జమ కట్టి వర్గ శత్రువుల దుర్గంధాల వాకిట ముష్టికి వెడతారా?/ బొచ్చె పట్టుకుని బిచ్చమెత్తుకుని/ చచ్చిన చావు వద్దు సుమా అని హెచ్చరించారు. మార్క్సూ లెనినూ మనకై వేసిన మార్గంలోనే చరిద్దాము/ మరో ప్రపంచం మరో ప్రపంచం / మరలా మనమూ రచిద్దాం/విశ్రమించక విధిగా సరిగా శ్రీశ్రీ గీతిక పఠిద్దాం అని అమెరికాలో వుండగా రాసిన పాట ప్రజాశక్తికి పంపించారు.
ఆరుద్ర 1998 జూన్‌ 4న కన్నుమూసిన సంగతి అంత్యక్రియలు ముగిశాక తెలిసిందంటే అది కూడా ఆయన నిరాడంబరతకు ఓ నిదర్శనమే. తన అంతిమ ఘట్టం అలా నిశ్శబ్దంగా జరిగిపోవాలని ఆయన ఆకాంక్షించారట. ఆయన భార్య రామలక్ష్మి 2023 మార్చి 3న కన్నుమూశారు. చరిత్రనే తిరగదోడే సంఘ పరివార్‌ దాడులు, సాహిత్యంలోనూ సమిష్టి ప్రయోజనం కన్నా వ్యక్తిగత ధోరణులు వాణిజ్య ప్రభావాలు పెంచుతున్న ఈ తరుణంలో ఆరుద్ర జీవిత ప్రస్థానం జిజ్ఞాసులు, చైతన్య గత ప్రాణుల అధ్యయనానికి మార్గదర్శకం. అన్ని అవకాశాలు వుండి కూడా ఉద్యమంతో మమేకం కావాలని పరితపించిన ఆరుద్ర జీవితం, కషి ఆదర్శప్రాయం. శత జయంతి సంవత్సరంలో ఆరుద్ర సాహిత్యం అధ్యయనాల వారసత్వాలను సంస్కరించుకుందాం. అలవర్చుకునే ప్రయత్నం చేద్దాం.
(ఆరుద్ర శత జయంతివత్సరం సందర్భంగా)
తెలకపల్లి రవి