– 15 రోజులు జ్యుడీషియల్ రిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తీహార్ జైల్‌కు తరలించారు. ఈ కేసులో మార్చి 21న ఈడీ ఆయనను అరెస్టు చేయగా, అప్పటి నుంచి వారి కస్టడీలోనే ఉన్నారు. సోమవారం ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులిచ్చారు. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆయన ఏప్రిల్ 15 వరకూ జైలులోనే ఉంటారు. కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో రిపోర్టర్లు కేజ్రీవాల్‌ని ప్రశ్నించగా ప్రధాని మోడీ దేశానికి మంచి చేయటం లేదని అన్నారు.
కోర్టుకు కేజ్రీవాల్ ఐదు అభ్యర్థనలు
అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు కోర్టులో ప్రత్యేక అప్లికేషన్ దాఖలు చేశారు. మూడు పుస్తకాలు, మందులు, ప్రత్యేక ఆహారం ఇలా మొత్తం ఐదు అభ్యర్థనలను కోర్టు ముందు ఉంచారు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాలను కేజ్రీవాల్ చదువుకుంటారని ఆయన తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా.. ప్రత్యేక డైట్ అందించా లని, జైల్లోకి మందులు అనుమతించాలని తెలిపారు. జైల్లో మతపరమైన లాకెట్ ధరించేందుకు అనుమతితో పాటు ఒక కుర్చీ, టేబుల్ అనుమతించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు కేజ్రీ తరపున న్యాయవాదులు కోర్టులో దరఖాస్తు చేశారు.
జైల్ నెంబర్-2లో కేజ్రీవాల్
కస్టడీ గడువు వరకూ తీహార్ జైలులోని జైల్ నెంబర్-2లో కేజ్రీవాల్ ఒక్కరే ఉంటారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన మనీష్ సిసోడియా జైల్ నెంబర్-1, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జైల్ నెంబర్-7, రాజ్యసభ ఎంపీ సంజరు సింగ్ జైల్ నెంబర్-5లో ఉంటున్నారు. బీఆర్‌ఎస్ నేత కె.కవిత తీహార్ జైలులోని జైల్ నెంబర్-6 (మహిళా జైలు)లో ఉంటున్నారు.
జైలులో కేజ్రీవాల్ దినచర్య
కేజ్రీవాల్‌తో పాటు జైలులోని ఇతర ఖైదీల దినచర్య ఉదయం 6.30 గంటలతో మొదలవు తుంది. ఖైదీలకు బ్రేక్‌ఫాస్ట్‌గా టీ, బ్రెడ్ ముక్కలు ఇస్తారు. ఆ తర్వాత కేసువిచారణ ఉంటే కోర్టుకు కేజ్రీవాల్ వెళ్తారు. లేదంటే తన న్యాయవాదుల బృందంతో సమావేశమవుతారు. 10.30 నుంచి 11 గంటల వరకూ మధ్యాహ్న భోజనం (లంచ్) ఉంటుంది. పప్పు, సబ్జీ, ఐదు రొట్టెలు లేదా రైస్ ఇస్తారు. ఆ తర్వాత 3 గంటల నుంచి ఖైదీలను సెల్‌లోనే ఉంచుతారు. 3.30 గంటలకు టీ, రెండు బిస్కట్లు ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు తమ లాయర్లను కలవవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఎర్లీ డిన్నర్ ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి జైలుగదిలోనే ఉంచుతారు.
జైలులో సౌకర్యాలు
కేజ్రీవాల్‌కు జైలులో టీవీ చూసే సౌకర్యం కల్పించారు. వార్తలు, వినోదం, క్రీడలు సహా 18 నుంచి 20 ఛానెల్స్ చూసే అవకాశం ఉంది. 24 గంటలూ మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్ కావడంతో కేజ్రీవాల్‌కు జైలులో రెగ్యులర్‌గా మెడికల్ చెకప్‌లు ఉంటాయి. కుటుంబ సభ్యులను వారంలో రెండుసార్లు కలుసుకునే వీలు కల్పించారు. కుటుంబ సభ్యుల జాబితాను నిర్ధారించుకున్న తర్వాతే జైలు భద్రతా సిబ్బంది వారికి అనుమతి ఇస్తారు.
కేజ్రీవాల్ సహకరించడం లేదు: ఈడీ
లిక్కర్ స్కాం కేసు దర్యాప్తునకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహకరించడం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. అలాగే ఒక కీలక ప్రశ్నకు సమాధానంగా ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లను ఆయన బయటపెట్టారని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఈ కేసు లో నిందితుడైన ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ విజరు నాయర్‌తో తనకు అంతగా సంప్రదింపులు లేవని, అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను ఆయన కలిసేవాడని కేజ్రీవాల్ చెప్పారని ఈడీ వెల్లడించింది. కాగా, ఢిల్లీలో మద్యం రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వానికి వంద కోట్ల ముడుపులు అందించిన ‘సౌత్ గ్రూప్’నకు మధ్యవర్తిగా విజరు నాయర్ వ్యవహరించినట్లు చార్జిషీట్‌లో ఈడీ ఆరోపించింది. కేజ్రీవాల్‌తో తన సమావేశాన్ని విజరు నాయర్ ఏర్పాటు చేసినట్లు ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రుడు దర్యాప్తులో చెప్పాడని ఈడీ పేర్కొంది. మరోవైపు నేరుగా సమావేశం కుదరకపోవడంతో వీడియో కాల్ ద్వారా కేజ్రీవాల్‌తో సమీర్‌ను విజరు నాయర్ మాట్లాడించాడని ఈడీ తెలిపింది. వీడియో కాల్ సందర్భంగా నాయర్ తమ వ్యక్తి అని ఆయనను నమ్మవచ్చని, ఆయనతో మాట్లాడవచ్చని సమీర్‌తో కేజ్రీవాల్ అన్నట్లుగా ఆ చార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. కాగా, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పిటిషన్ నేడు (మంగళవారం) విచారణకు రానుంది.