నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
నిటి ఆయోగ్ మాజీ వైస్ చైర్మెన్ అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం చైర్మెన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీనితో పాటు రిత్విక్ రంజనం పాండేను కమిషన్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 16వ ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గ గత నెలలో ఆమోదించింది. ఐదేండ్ల కాలానికి (2026-27 నుంచి 2030-31) సంబంధించిన రిపోర్ట్‌ను 2025 అక్టోబర్ 31లోగా రాష్ట్రపతికి కమిషన్ సమర్పించాల్సి ఉంటుంది.
కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయం పెంపుదలకు సంబంధించిన చర్యలను ఆర్థిక సంఘం సూచిస్తుంది. ఫైనాన్సింగ్ డిజాస్టర్ మేనేజిమెంట్ కోసం ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లపై కూడా సమీక్ష జరుపుతుంది. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సలహాలు ఇచ్చే రాజ్యాంగ వ్యవస్థగా ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. కాగా, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకువచ్చిన నీతి ఆయోగ్‌కు తొలి చైర్మెన్‌గా అరవింద్ పనగరియాను 2015లో మోడీ సర్కార్ నియమించింది. పనగరియా న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేయడంతో పాటు ఏడీబీ, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓలో వివిధ హౌదాలలో పని చేశారు.