
నవతెలంగాణ – డిచ్ పల్లి
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వీంద్ కు గల్ఫ్ కార్మికుల ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు శుక్రవారం డిచ్ పల్లి లో గల్ఫ్ చార్జిషీట్ ను విడుదల చేశారు.గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికులకు అక్కడ కంపెనీలు ఇస్తున్న కనీస వేతనాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 30% నుండి 50% శాతం వరకు తగ్గిస్తూ సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లను జారీ చేసి కార్మికుల పొట్ట కొట్టిందని వివరించారు. ప్రవాసి భారతీయ బీమా యోజన అనే పథకంలో రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమాలో సహజ మరణాన్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్లు (దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా… కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని అన్నారు.కరోనా కష్టకాలంలో గల్ఫ్ తదితర దేశాల నుంచి భారత్ కు వాపస్ వచ్చిన ప్రయాణీకుల నుంచి వందే భారత్ ప్లయిట్స్ లలో రెండింతలు, చార్టర్డ్ ఫ్లయిట్స్ లలో మూడింతలు విమాన ఛార్జీలు వసూలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రవాసి కార్మికులను ఎందుకు దోచుకున్నారని, బీజేపీ మోదీ ప్రభుత్వం ఎన్నారైలకు ఆన్ లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందని పేర్కొన్నారు. మోదీకి ఎన్నారైలు అంటే ఏదో తెలియని భయం పట్టుకున్నదా.అని ప్రశ్నించారు.గల్ఫ్ కార్మికుల సంఘాల గౌరవ అధ్యక్షులు, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి కి గల్ఫ్ కార్మికుల కుటుంబాలు మద్దతు ఇచ్చి ఎంపీగా గెలిపించాలని వక్తలు కోరారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, మంద భీంరెడ్డి, చిన్నారెడ్డి సంతోష్ రెడ్డి, మోత్కూరి నవీన్ గౌడ్, గల్ఫ్ రిటనీలు గాండ్ల పండరి, నారవోయిన రవీందర్, అర్పెల్లి మోహన్, మహ్మద్ మొకిద్, యాదగిరి గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.