ఆశావర్కర్లకు పరీక్షలా!

నవతెలంగాణ-కంఠేశ్వర్‌
ఆశావర్కర్ల ఎగ్జామ్‌ను రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. బుధవారం ఆశావర్కర్ల సమస్యపై నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నాకు జయలక్ష్మి హాజరై మాట్లాడారు. 18 ఏండ్ల నుంచి ఆశా వర్కర్లు అనేక రకాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ప్రభుత్వం చేపట్టే హెల్త్‌ సర్వేలు, కంటి వెలుగు, పల్లె దవాఖాన పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వారిని నియమించేటప్పుడు మాతా శిశు మరణాలు రాయడానికి వస్తే చాలని, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 25 ఇండ్లు విజిట్‌ చేస్తే చాలని చెప్పిందని, కానీ దానికి భిన్నంగా అనేక పనులు చేయించుకుంటూ వారిని ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆశాలకు పెట్టే ఎగ్జామ్‌ను రద్దు చేయాలని, ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని, అధికారుల వేధింపులను ఆపాలని, నెలనెలా 5 తేదీలోపు జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్‌ మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు ఒక్కరోజు ఆరోగ్యం బాగాలేక డ్యూటీకి వెళ్ళకుంటే అనేక రకాలుగా వేధిస్తున్నారని తెలిపారు. వారికి ఫిక్స్‌డ్‌ వేతనం రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ కార్యదర్శి విజయ, కోశాధికారి రేణుక, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజామణి, జిల్లా ఉపాధ్యక్షులు బాలమణి, రమ, విజయ, దివ్య, సుజాత, స్వప్న, సుకన్య, సహాయ కార్యదర్శులు భూలక్ష్మి, శాంతి, లావణ్య, నీలోఫర్‌ రాధా, బాలమణి, రేణుక, భాగ్య తదితరులు పాల్గొన్నారు.