మహిళా బిల్లు పట్ల భారతీయునిగా గర్వపడుతున్నా

– కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చట్టసభల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్వాగతించారు. మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం పట్ల భారతీయునిగా గర్విస్తున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. మహిళా బిల్లు కోసం తాము సైతం ఎన్నో ప్రయత్నాలు చేశామన్నారు. మహిళా బిల్లు సాకారానికి తమ వంతు ప్రయత్నం చేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. తాము రాజకీయాలకు అతీతంగా లేవనెత్తిన కొన్ని అంశాలున్నాయనీ, చరిత్రలో గుర్తుండిపోయే ఈ చట్టానికి మద్దతిచ్చే అన్ని పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశంపై అందరూ కలిసి రావాలని కోరారు. మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. చాలా ఏండ్ల కిత్రమే జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు తదితర స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు.