ఈసారి ఎన్నికలకు ఎలాంటి ఎజెండా లేకపోవటమో.. లేక బిల్లును ప్రవేశపెట్టి, దానికి మెలికలు పెట్టేందుకు చేశారో తెలియదు గానీ… మొత్తానికి ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లుకు పార్లమెంటులో మోక్షం లభించింది. దీంతో ఊరూ వాడా ఏకమై మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సంగతిని కాసేపు పక్కనబెడితే… అసలు ఈ మహిళా బిల్లు రావటానికి తానే కారణమనీ, తాను చేసిన పోరాటం వల్లే (ప్రస్తుత పార్లమెంటు సమావేశాలకు కొద్ది రోజుల ముందు హడావుడి చేశారు లెండి…) మోడీ సర్కార్ తలొగ్గి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్లు, జూనియర్లనే తేడా లేకుండా గులాబీ పార్టీ నేతలు ఆమెను ప్రశంసిస్తూ పుష్పగుచ్ఛాలతో ముంచెత్తుతున్నారు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయ పండితులు మాత్రం… ‘ఇటీవల బీఆర్‌ఎస్, బీజేపీ రాసుకుని పూసుకుని తిరుగుతున్న క్రమంలో ‘నువ్వు కొట్టినట్టు నటించు, నేను ఏడ్చినట్టు నటిస్తా…’ అన్నట్టుగా ఈ వ్యవహారం ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. మహిళా బిల్లు లోక్‌సభలో ప్రవేశపెడతారని ముందుగా తెలిసే… కవిత ఈ మధ్య ఆ బిల్లుపై హడావుడి చేశారంటూ వారు సెటైర్లు విసురుతున్నారు. లేకపోతే ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లును కవిత ఒక్క ధర్నా చేయగానే దాన్ని ఆమోదించటానికి బీజేపీ ఏమైనా తెలివి తక్కువ పార్టీ అనుకున్నారా..? అంటూ కవిత మీద విమర్శల దాడి మొదలైంది. ‘కవితక్క ఒక్కసారి ఆందోళన చేస్తేనే ఢిల్లీలోని మోడీ సర్కారు దిగొచ్చినప్పుడు… అదే హైదరాబాద్‌లోని కేసీఆర్ ప్రభుత్వానికి ఆమె ఒక్క మాట చెబితే… దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాలు బ్రహ్మాండంగా అమలవుతాయి కదా? హైదరాబాద్‌లోని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కూడా వస్తాయి కదా..? అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే.. ఈ అంశాలపై కవితక్క ఒక్కసారి స్పందిస్తే ఎంత బావుంటుందో… -కే.నరహరి