– విద్యాశాఖ స్పష్టీకరణ
– కొన్ని అంశాలపై ఎన్‌సీటీఈ వివరణ కోరిన అధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంటా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించే అవకాశం లేదు. ఇదే విషయాన్ని ఉపాధ్యాయులు, ఆయా సంఘాలకు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న టెట్‌లోనే ఉపాధ్యాయులు కూడా రాయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 1.04 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో నాలుగు వేల మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు (జీహెచ్‌ఎం) ఉన్నారు. మిగిలిన లక్షలో సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణులయ్యారు. ఇంకా 70 వేల మంది ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత కాలేదు. పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) స్పష్టం చేసింది. దీంతో వారు టెట్ ఉత్తీర్ణత కావాల్సి ఉన్నది. గతంలో విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్లలో 2010, ఆగస్టు 23కు ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత మినహాయించబడిందని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఆ నిబంధనను విద్యాశాఖ తొలగించింది. అయితే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు ఎవరు ఏ పేపర్ రాయాలో కొంత అస్పష్టత ఉన్నది. దీంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ), విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) 2009 ప్రకారం ఒక స్థాయి నుంచి మరో స్థాయికి పదోన్నతి పొందా లంటే ఆ స్థాయికి సంబంధించిన పూర్తి అర్హతలు కలిగి ఉండాలని అవి పేర్కొన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందే ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత కావాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకే టెట్ అవసరమని ఎన్‌సీటీఈ స్పష్టం చేసింది. దీంతో ఉపాధ్యాయుల్లో కొన్ని సందేహాలున్నాయి. వాటిని నివృత్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఇటీవలే విన తిపత్రం సమర్పిచారు. ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాధ్యా యుడు (పీఎస్‌హెచ్‌ఎం (ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం)) పోస్టులు రెండూ ఒకే స్థాయికి చెందినవి. 2010, ఆగస్టు 23కు ముందే ఎస్జీటీగా నియామకమైన ఉపాధ్యాయులు పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతి పొందాలంటే టెట్ పేపర్-1 ఉత్తీర్ణత కావాలా? వద్దా? స్పష్టత ఇవ్వా లని కోరుతున్నారు. స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధిస్తారు. ఆర్టీఈ చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే టీచర్లకే టెట్ అవసరం. తొమ్మిది, పది తరగతులకు టెట్ నిబంధన వర్తించదు. దీంతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు జీహెచ్‌ఎం పదోన్నతి కోసం టెట్ పేపర్-2 ఉత్తీర్ణత కావాల్సిన అవసరం లేదు. దీనిపైనా స్పష్టత కావాలంటున్నారు. భాషా పండితులు (ఎల్పీలు) ప్రాథమికోన్నత (6,7,8 తరగతులు) పాఠశాలల్లో నియమించబడ్డారు. వారికి స్కూల్ అసిస్టెంట్ (భాషలు)గా ఉన్నత పాఠశాల స్థాయికి పదోన్నతి కావాలంటే ఆర్టీఈ చట్టం ప్రకారం టెట్ నిబంధన వర్తించదు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కోసం టెట్ పేపర్-2 ఉత్తీర్ణత కావాల్సిన అవసరం లేదు. దీనిపై స్పష్టత ఇవ్వాలంటున్నారు. ఉపాధ్యాయులు అడిగిన పలు అంశాలపై ఎన్‌సీటీఈని వివరణకోసం విద్యాశాఖ అధికారులు నెలరోజుల క్రితమే లేఖ రాశారు. ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి వివరణ అక్కడి నుంచి రాలేదు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.ఎన్‌సీటీఈ అధికారులను కూడా కలిసి టెట్‌కు సంబం ధించిన పలు అంశాలపై వివరణల గురించి అడిగే అవకాశ మున్నట్టు తెలిసింది. ఆ తర్వాతే ఉపాధ్యాయులకు స్పష్టత రానుంది.