– ఆవలగావ్ విఠలేశ్వర స్వామి ఆలయ భూమి సర్వే నంబర్ 162, విస్తీర్ణం 4 ఎకరాలు 21 గుంటలు
– ఈ భూమిని కౌలుకు ఇచ్చారా.. ఎవరి ఆధీనంలో కొనసాగుతుంది
– చర్చించుకుంటున్న ప్రజలు
– చర్చించుకుంటున్న ప్రజలు
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ భూముల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. గ్రామాల్లో గల ఆలయాల భూములు స్వాధీనం చేసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ భూములకు కౌలు వేలంపాట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆలయ భూముల పట్ల పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల మద్నూర్ మండలంలోని మేనూర్ హనుమాన్ టెంపుల్ భూమి 14 ఎకరాల 16 గంటలకు వేలంపాట వేయగా ఎనిమిది లక్షల 51 వేల రూపాయలు ఆదాయం రావడం జరిగింది. అదేవిధంగా మద్నూర్ మండలంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ రికార్డుల్లో గల ఆవలగావ్ గ్రామంలో సర్వే నెంబర్ 162 విస్తీర్ణం 4 ఎకరాల 21 గుంటల భూమి ఆ గ్రామంలో గల విఠలేశ్వర స్వామి ఆలయ పేరా ఉన్నట్లు తెలుస్తోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ రికార్డుల్లో భూమి ఉన్నట్టే, ఆ భూమిని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు లెక్క చేయనట్టే కనిపిస్తుందని ప్రజల్లో చర్చలు వినబడుతున్నాయి. అవలగావ్ గ్రామంలో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ విఠలేశ్వర స్వామి ఆలయ భూమికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి. ఆ భూమిని కౌలు ఇచ్చారా లేక ఆలయ భూమిని ఎవరైనా అక్రమంగా సాగు చేసుకుంటున్నారా అనే దానిపై ప్రజల్లో రకరకాల చర్చలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఆలయ భూములు దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సహకారంతో మద్నూర్ మండలంలో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ భూములు అన్యక్రాంతం కాకుండా అక్రమ కబ్జాల నుండి అధికారులు స్వాధీనం చేసుకొని ఆలయాల అభివృద్ధికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేకంగా కృషి చేయాలని మండల ప్రజలు సంబంధిత శాఖ అధికారులకు కోరుతున్నారు.