అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం మీద తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల ది గ్రేట్’. కష్ణ చైతన్య టైటిల్ పాత్ర పోషించారు. ఇందులో ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో కష్ణ చైతన్య భార్య మదుల నటించారు. సిహెచ్ రామారావు దర్శకత్వంలో సిహెచ్ శ్రీమతి ఫణి నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆర్.నారాయణమూర్తి, నిర్మాత అశోక్ కుమార్, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, నటులు అశోక్ కుమార్, సుబ్బరాయ శర్మ, నటి జయవాణి, నిర్మాత దామోదర ప్రసాద్, దర్శకులు కర్రి బాలాజీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ‘ఘంటసాల జీవితం గురించి నవ తరానికి, యువ తరానికి, నేటి తరానికి తెలియచెప్పే కార్యక్రమం కావడంతో వచ్చాను. ఘంటసాల సమగ్ర జీవితాన్ని ఇతివత్తంగా తీసుకుని సినిమా తీశామని, అన్ని విషయాలు స్పశించామని మేకర్స్ తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రజా గాయకుడిగా, ప్రముఖ సంగీత దర్శకుడిగా, అన్నింటికీ మించి అమర గాయకుడిగా దేశానికి, తెలుగు ప్రజలకు పరిచయస్తులు. సంగీతం ఉన్నంత కాలం ఆయన ప్రజల మనసుల్లో ఉంటారు’ అని తెలిపారు. ‘ఘంటసాల పాట అందరికీ తెలుసు. ఆ పాట ఎంత గొప్పదో తెలుసు. కానీ, ఆయన వ్యక్తిత్వం చాలా కొంతమందికే తెలుసు. కషితో నాస్తి దుర్భిక్షం, వినయంతో విద్య ప్రకాశిస్తుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఘంటసాల. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆ జీవితాన్ని మా సినిమాలో చూపించడం జరిగింది. భారతదేశ సినిమా చరిత్రలో ఏ గాయకుడి మీద పూర్తి స్థాయి నిడివి సినిమా రాలేదు’ అని దర్శకులు సిహెచ్ రామారావు చెప్పారు.